TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిట్టా పోయి.. కుక్కా వచ్చే ఢాంఢాంఢాం..!

Published on: Tue Apr 4, 2023 8:31PM

ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై  దృష్టి పెట్టాడు.  ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్ లో కాదు..  డెస్క్ టాప్  వెర్షన్లో మాత్రమే ఇలా  చేశాడు. 

ట్విటర్ వెబ్ సైట్ లో  హోం బటన్ గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టో కరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్ లో కనిపిస్తోంది. 


ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్ ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు. 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నారు.

అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను 'డాగ్'గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్ షాట్  షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.

 క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్ కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్ పై   ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత
 డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరగటం గమనార్హం..!