సమయాన్ని ఆదా చేసే Eisenhower Method

 

చరిత్ర చదువుకున్న చాలామందికి Eisenhower అన్న పేరు పరిచయం ఉండే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనిక జనరల్‌గా ఐసన్‌హోవర్ ప్రసిద్ధుడు. ఆ ప్రజాదరణతోనే తర్వాతకాలంలో అమెరికా అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. సైన్యాన్ని నడపాలన్నా, దేశాన్ని పాలించాలన్నా ఏమంత తేలికైన విషయం కాదు కదా! ప్రతి క్షణమూ చాలా విలువైనదే. ప్రతి నిర్ణయమూ ప్రాణాంతకమే! అలాంటి సందర్భంలో ఐసన్‌హోవర్ రూపొందించుకున్న ఒక సూత్రానికే Eisenhower Method అని పేరు పెట్టారు.

 

‘నా ముందు రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి అత్యవసరంగా (urgent) తేల్చాల్సినవి, రెండు తప్పనిసరిగా (important) తేల్చాల్సినవి. అత్యవసరం అనుకున్నది తప్పనిసరి కాకపోవచ్చు. తప్పనిసరి అనుకున్నది అత్యవసరం కాకపోవచ్చు,’ అని ఐసన్‌హోవర్‌ ఒకానొక సందర్భంలో అన్నారు. ఇదే మాటల్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వ వికాస నిపుణులు Eisenhower Methodని రూపొందించారు.

 

Eisenhower Methodలో మన పనులని నాలుగు రకాలుగా విభజించాలని చెబుతారు...

(1) Urgent and important - వీలైనంత త్వరగా, తప్పనిసరిగా చేసితీరాల్సిన పనులు మొదటి జాబితాలోకి వస్తాయి. పై అధికారి ఫోన్ చేస్తున్నారనుకోండి, ఆ ఫోన్‌ తప్పనిసరిగా వెంటనే రిసీవ్ చేసుకోవాల్సిందే కదా! పిల్లవాడు కిందపడిపోతే, వెళ్లి పైకి లేపాల్సిందే! ఈ జాబితాలోకి వచ్చే పనులను సాధారణంగా ఎవరైనా చేసి తీరతారు. ఇవి కూడా చేయడం లేదు అంటే వారంతటి పలాయనవాదులు మరొకరు ఉండరు.

 

(2) Not urgent but important – త్వరగా ఇంటికి వచ్చేస్తానని భార్యకి చెప్పాం. అది అత్యవసరం కాకపోవచ్చు. కానీ భార్య మనసు నొప్పించకుండా ఉండాలంటే మాటకి కట్టుబడి ఉండాల్సిందే! అలాగే ఒళ్లు తగ్గించుకోవడం కోసం వ్యాయామం చేయాలని అనుకుంటున్నాం. వ్యాయామం చేయకపోతే కొంపలు మునిగిపోవు. కానీ నిదానంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలామంది ఈ రెండో విభాగంలోని విషయాలను పూర్తిగా అశ్రద్ధ చేస్తుంటారు. అత్యవసరం కాదు కదా అన్న చులకన భావంతో విలువైన బంధాలనీ, లక్ష్యాలనీ, ఆరోగ్యాన్నీ దూరం చేసుకుంటారు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం వీటికి కూడా జీవితంలో భాగం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.

 

(3) Urgent but not important – దూరపు బంధువుల పెళ్లికి వెళ్లాలి. కుటుంబంలో ఎవరో ఒకరు ఆ వేడుకకు వెళ్తే సరిపోతుంది. మీకేమో ఆఫీసులో బోల్డు పని ఉంది. సహజంగానే భార్యనో పిల్లలను పెళ్లకి పంపిస్తారు కదా! మనం సమయం వృధా చేసుకోకుండా, ఇతరుల ద్వారా సాధించగలిగే కార్యాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. కొంత డబ్బు కేటాయించో, పలుకుబడిని ఉపయోగించో, సాయాన్ని అర్థించో... ఇతరులతో చేయించగలిగే పనుల కోసం మీ సమయాన్ని వదులుకోవద్దని చెబుతున్నారు నిపుణులు.

 

(4) Not urgent and not important – కంప్యూటర్‌ ఆన్‌ చేస్తాం.... ఎందుకు ఆన్‌ చేశామో మనకే స్పష్టత లేదు. కాబట్టి ఏదో బ్రౌజ్‌ చేస్తూ సమయాన్ని గడిపేస్తాం. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాం... ఏవో పోస్టులు చూస్తూ కాలాన్ని మర్చిపోతాం. వీడియోగేమ్స్, టీవీ, సెల్‌ఫోన్‌లో కబుర్లు, పేకాట, బార్లో పార్టీలు... ఇలా చాలా సందర్భాలలో తెలిసో తెలియకో విలువైన కాలాన్నంతా వృధా చేసేస్తుంటాం. మనం చేసే ఈ పనులు అత్యవసరమూ కాదు, తప్పనిసరి కూడా కాదు. ఉత్త చెత్త! ఇలాంటి పనులను తగ్గించుకుంటే, జీవితంలో ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు.

మరింకేం! మీరు కూడా ఓసారి ఈ Eisenhower Methodని పాటించి చూడండి మరి.

 

- నిర్జర.