పిచ్చివాడి చేతిలో విమానం!
Published on: Wed Mar 30, 2016 10:46AM
ఆరుగంటల పాటు ఈజిప్టు దేశాన్ని గడగడ వణికించిన హైజాక్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. నిన్న ఉదయం అలగ్జాండ్రియా నుంచి కైరోకు బయల్దేరిన ఓ విమానాన్ని ఆగంతకుడు హైజాక్ చేసిన విషయం తెలిసిందే! ఆగంతకుడు తన నడుముకి పేలుడుపదార్థాలని చుట్టుకున్నానని బెదిరించడంతో, ఈజిప్టు ఒక్కసారిగా వణికిపోయింది. పైగా విమానంలో ఉన్న 72మందిలో డజనులకు పైగా విదేశీయులు ఉండటంతో, ఈ ఘటన ప్రపంచాన్నే వణికించింది. హైజాకరు ISIS తీవ్రవాదేమో అన్న భయాలూ మొదలయ్యాయి. హైజాకర్ విమానాన్ని లర్నాకాలో దింపమంటూ ఒత్తిడి చేయడంతో, పైలట్లు అతని మాటను అంగీకరించారు. విమానం లార్నాకాలో దిగిన తరువాత ఏడుగురు వ్యక్తులను తప్ప మిగతావారిని హైజాకర్ విడిచిపెట్టడంతో, పరిస్థితి కాస్త నెమ్మదించింది.
నిమిషాలు గడిచేకొద్దీ హైజాకర్ అంత ప్రమాదకరమైన వ్యక్తి కాదని అధికారులకు అర్థం కాసాగింది. ఒకదాని తరువాత ఒకటి పొంతన లేని డిమాండ్లను అతను వల్లె వేస్తూ ఉండటంతో అతని మతిస్థిమితం మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలో లార్నాకాలో ఉన్న తన భార్యను చూసేందుకే విమానాన్ని హైజాక్ చేశానని చెప్పడంతో, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అతని భార్యను విమానాశ్రయానికి రప్పించి, ఆపై హైజాకరును అరెస్టు చేశారు. హైజాకరుకు మతిస్థిమితం లేదనీ, 1994లో తన భార్య నుంచి విడాకులను పొందిన తరువాత, మరింత కుంగిపోయాడనీ అధికారులు చెబుతున్నారు. అతని వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని కూడా వెల్లడిస్తున్నారు. హైజాకరు మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేనప్పటికీ, అతని చర్యల వల్ల ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నది మాత్రం వాస్తవం. కాబట్టి, ఈ చర్యకుగాను సదరు వ్యక్తికి భారీగానే శిక్షపడే అవకాశం కనిపిస్తోంది.


