TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్మా ప్రయోగిస్తే ఉద్యోగులకు జరిగేది ఇదే

Published on: Sun Jan 30, 2022 11:17AM

ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం తీవ్రరూపం దాల్చే అవకాశాలను సీరియస్ గా తీసుకుంటున్న జగన్ సర్కారు.. ఎస్మా ప్రయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎస్మా కిందికి ఏయే ప్రభుత్వ సేవలను తీసుకురావాలి, ఎంతమంది ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి వస్తారు, అయినా వారు మొండిపట్టు వీడకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లేంటి అనే అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్మా ప్రయోగిస్తే ఎంతమంది ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు. ఎస్మా ప్రయోగిస్తే గనక ఎంతమంది ఉద్యోగులు సమ్మె నుంచి విరమించుకునే అవకాశాలున్నాయో కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఎస్మా అంటే ఏంటి.. ఆ చట్టాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారు.. అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుంది అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

ప్రజలకు అందించాల్సిన సేవలు అందించకుండా  వారి దైనందిన జీవనానికి ఇబ్బంది కలిగించినప్పుడు ఎస్మా ప్రయోగిస్తారు. ‘ఎస్మా’ అంటే ‘ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టెనెన్స్‌ యాక్ట్‌’కు సంక్షిప్త రూపం. సమ్మెలు, హర్తాళ్ల వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలు అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 8 వ దశకంలో కార్మిక సంఘాలు చీటికీమాటికీ నిరసనలకు పిలుపునిచ్చేవి. వాటి నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో పార్లమెంట్‌ ముందు భారీఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. క్రమేపీ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండడంతో.. ముందుగా 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ కేంద్రం ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తర్వాత ఆ ఆర్డినెన్స్‌ స్థానే.. ‘ఎస్మా’ చట్టం తీసుకొచ్చారు. జమ్మూకాశ్మీర్‌ తప్పించి దేశవ్యాప్తంగా వర్తించే చట్టం ఇది.

ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా ‘అత్యవసర సేవ’గా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి ‘ఎస్మా’ వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ప్రధానంగా-నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతితపాలాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్‌, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి-రవాణా-పంపిణీ సేవలన్నింటికీ దీన్ని వర్తింపజెయ్యచ్చు. అలాగే బ్యాంకింగ్‌, ఆహార ధాన్యాలు, పదార్ధాల పంపిణీ వంటివాటన్నింటికీ దీన్ని వర్తింపజెయ్యచ్చు. ఈ చట్టప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే- ఇక ఆయా రంగాల్లో సేవలు అందించే వారు సమ్మె చేయటమనేది ‘చట్ట విరుద్ధ’ కార్యకలాపమవుతుంది. ఒకవేళ వారి సేవలు అత్యవసరమైనవైతే అదనపు సమయం పని చేయటానికి తిరస్కరించే హక్కును వారు కోల్పోతారు. 

ఎస్మా నిబంధనలు అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా అనుమానం ఉంటే.. నేరశిక్షాస్మృతి (సీపీసీ)తో సంబంధం లేకుండానే.. పోలీసు అధికారులు ‘వారంట్‌ లేకుండానే’ అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేసే ఉద్యోగులను డిస్మిస్‌ చేయటంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్నవారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం- సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే.
 
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై ‘ఎస్మా’ ప్రయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగినప్పుడు జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దాదాపు లక్షా 70 వేల మందిని విధుల్లోంచి తొలగించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాతగానీ వారంతా తిరిగి విధుల్లో చేరలేకపోయారు. సమ్మె కట్టిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎస్మా ప్రయోగించారు. 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు, 2009లో ట్రక్కు రవాణా దారులు సమ్మె చేసినప్పుడు, 2009లో చమురు, గ్యాస్‌ సిబ్బంది సమ్మె చేసినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో ‘ఎస్మా’ ప్రయోగించారు. మరి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి... ఎస్మా ఆదేశాలు జారీ కాకముందే జగన్ ఏదైనా పరిష్కారానికి ప్రయత్నిస్తారా.. లేక ఉద్యుగులు మొండిపట్టు వీడక ఎస్మా దాకా తెచ్చుకుంటారా.. చూడాలి.