TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై ఈడీ దాడులు

Published on: Tue Aug 2, 2022 3:31PM

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం ఈడీ దూకుడు పెంచింది. మంగళవారం ( ఆగస్టు 2)నాడు ఢిల్లీలోని ఆ పత్రిక కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. ఢిల్లీలోని ఆ సంస్థకు చెందిన 12 కార్యాలయాలపైనా, అలాగే కోల్ కతాలోని మరో రెండు కార్యాలయాలపైనా ఏక కాలంలో దాడులు నిర్వహించింది. ఆ కార్యాలయాలలో సోదాలు కొనసాగుతున్నాయి.  

ఇదే కేసుకు సంబంధించి ఇటీవ‌లే తొలుత రాహుల్ గాంధీ, ఆ త‌ర్వాత సోనియా గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీని 5 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు సోనియాను 3 రోజుల పాటు విచారించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే దిశ‌గా ఓ ప‌త్రిక‌ను న‌డ‌పాల‌న్న ఉద్దేశంతో గ‌తంలో భార‌త మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌  స్థాపించారు.

ఈ ప‌త్రిక నిర్వ‌హ‌ణ కోసం యంగ్ ఇండియా పేరిట ఓ సంస్థ‌ను కూడా ఆయ‌న ఏర్పాటు చేశారు. ఈ సంస్థ‌కు చెందిన ఆస్తుల‌ను రాహుల్ గాంధీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా దారి మళ్లించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ విచార‌ణ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలను టార్గెట్ చేసుకుని మోడీ సర్కార్ ఈడీని పురమాయించి దాడులు చేయిస్తోందనీ, విచారణ పేరిట రోజుల తరబడి కాంగ్రెస్ అగ్ర నేతలను వేధింపులకు గురి చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

రాహుల్ విచారణ సమయంలోనూ, ఆ తరువాత సోనియా విచారణ సమయంలోనూ విపక్షాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ దాడులతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదంటూ కేంద్రం చెబుతూ వస్తున్నది.