నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గేను విచారించిన ఈడీ
Published on: Fri Aug 5, 2022 7:19AM
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేయడం, అంతకు ముందు రాహుల్ గాంధీ, సోనియాలను సుదీర్ఘంగా విచారించడం ముగిసిన తరువాత ఇదే కేసులో గతంలో విచారించిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ఆ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గేను గురువారం (ఆగస్టు 4) మరోసారి విచారించింది. అయితే మల్లిఖార్జున్ ఖర్గేను ఈడీ కార్యాలయంలో కాకుండా నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి పిలిపించుకుని విచారించడం గమనార్హం. కాగా ఈడీ సీజ్ చేసిన యంగ్ ఇండియా ఆఫీసు కూడా ఇక్కడే ఉన్న సంగతి విదితమే.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గురువారం మధ్యాహ్నం హాజరైన సంగతి తెలిసిందే. ఖర్గేను విచారణ కోసం ఈడీ అధికారులు తమ కార్యాలయానికి కాకుండా నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికే పిలిచారు.
ఈ కార్యాలయంలోనే ఈడీ బుధవారం సీజ్ చేసిన యంగ్ ఇండియా కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఒక పక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా మల్లి ఖార్జున్ ఖర్గే విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ దాదాపు ఐదు గంటలకు పైగా సాగింది.


