TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విపక్షాలపై మోడీ సర్కార్ సంధించిన అస్త్రం ఈడీ

Published on: Tue Aug 2, 2022 3:14PM

స‌ర్వ‌ స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించే ఒక వ్య‌వ‌స్థ‌ను త‌మ‌కు అనుకూలించే మార్గంలో ఉప‌యోగించుకోడం సదరు వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అవుతుంది. ఆ పని బీజేపీ  ఎలాంటి జంకూగొంకూ లేకుండా చేసేస్తోంది. త‌మ‌కు ఎదురుతిరిగిన‌వారిపై ఈడీ చేత దాడులు చేయించి మ‌రీ ప‌గ‌సాధించుకుంటోంది.  దేశంలో అవినీతిని అణ‌గ‌దొక్కుతాన‌ని ప్ర‌చారం చేసుకుని అధికారాన్ని దక్కించుకున్న మోడీ ఇప్పుడు తన  ఆధిప‌త్యాన్ని మ‌రింత విస్త‌రించేందుకు ఈడీని ఆయుధంగా వాడుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చెప్పిన అవినీతి నిర్మూలన అంతా ఈడీ, సీబీఐ వంటి అస్త్రాలను ప్రయోగించి రాజకీయ ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవడం కుదరకపోతే వేధింపులకు గురి చేయడంగా ఇప్పుడు అవగతమౌతోందిని అంటున్నారు.

దేశాన్ని అవినీతిర‌హితంగా చేయాల‌నుకోవ‌డం మంచిదే, కానీ ఇటీవ‌ల ఈడీ దాడులను క్షుణ్ణంగా ప‌రిశీలి స్తే, ఈడీ స‌మ‌న్లు అందుకున్న‌వారు అంద‌రూ విప‌క్షాల‌కు  చెంద‌న‌వారే కావడంతోనే మోడీ అవినీతి నిర్మూలన నినాదంపై అనుమానాలకు రేకెత్తిస్తోంది. అంటే విప‌క్షం అనేది లేకుండా చేసుకోవ‌డానికి కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను పావులుగా కాదు కాదు ఆయుధాలుగా వాడుకుంటోంది.   అయితే మోడీ సర్కార్ మాత్రం ఈడీ దాడులతో  త‌మ‌కు సంబంధం లేద‌ని, ఆ సంస్థ స్వ‌తంత్ర సంస్థ అని దాని ప‌ని అది చేసుకుపోతున్నదని చెబుతోంది. విప‌క్షాల మీద ఇంత  క‌క్ష సాధింపుగా  ఈడీ ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తుంది? ఇది కేవ‌లం బిజేపీ స్క్రిప్ట్‌ను అనుస‌రించే జ‌రుగుతోంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈడీ స‌మ‌న్లు అందుకున్న‌వారంతా  విప‌క్షాలవారే   కావ‌డంతో పరిశీలకుల విశ్లేషణలను సామాన్య జనం కూడా నమ్ముతున్నారు.  ఇదంతా మోదీ, షా  క‌నుసైగ‌ల తోనే జ‌రుగుతోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల క్రింద అక్రమార్జనపరుల ఇళ్లు, కార్యాలయాలు సోదాలు చేసేందుకు, అవసరమైతే అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు విస్తృత అధికారాల ను కల్పించడం సరైనదేనని సుప్రీం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అవినీతి పరుల పట్ల ఏమాత్రం కనికరం చూపకూడదన్నదే సుప్రీం తీర్పుసారాంశం. అయితే విపక్షాలను వేధించడానికీ  మోదీ ప్రభుత్వం   ఆ తీర్పు మరింత వెసులుబాటు కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. వాజపేయి ప్రభు త్వం 1998లో మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని స్థాయీ సంఘం నివేదికను 1999 మార్చి 4న లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే వాజ పేయి ప్రభుత్వం ఆ స్థాయీ సంఘం సిఫారసులను ఆమోదించింది.  2002లో మనీలాండరింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈడీకి  విస్తృతాధికారాల్ని కల్పించింది. ఆ విస్తృతాధికారాలనే మోడీ సర్కార్ ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

  కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, డికె శివకుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత సంజయ్ రౌత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీ, ఎన్‌సిపి నేతలు అజిత్ పవార్, నవాబ్ మాలిక్, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇలా ఈడీ కేసులు నమోదు చేసి సమన్లు జారీ చేసి తనిఖీలు చేసిన వారంతా విపక్షాలకు చెందిన వారే కావడంతో మోడీ సర్కార్ ఈడీ, సీబీఐలను తన గుప్పిట్లో పెట్టుకుని విపక్షాలపై వేధింపులకు ఉపయోగించుకుంటోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది.