వందల కోట్ల ఆస్తులు జప్తయినా చలించని ఏకైక ధీరుడు?

 

ఇదివరకు ప్రభుత్వం ఇచ్చే రెండు వందల రూపాయల పెన్షన్ కోసం అనేక వేల మంది వృదులు కాళ్ళరిగిపోయేలా తిరిగడం మనకి తెలుసు. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తరువాత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ కి అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్నవారు, గుండెపోటుతో చనిపోతున్న వారి గురించి కూడా మనకి తెలుసు. నీళ్ళు లేక కళ్ళ ముందు పంటలు ఎండిపోతుంటే, వాటి కోసం చేసిన అప్పులు తలుచుకొని అదే పొలాలలో పురుగుల మందులు త్రాగి ప్రాణాలు తీసుకొంటున్నవారి గురించి మనకి తెలుసు. వారు చనిపోయాక, వారి భార్యా పిల్లలను అప్పులిచ్చినవారు వేధిస్తుంటే పాపం ఆ తల్లీ పిల్లాలూ కూడా ఏ బావిలోనో దూకి ఆత్మహత్యలు చేసుకోవడం గురించి వార్తలు వింటున్నాము. ఇవన్నీ వింటున్నప్పుడు ఎవరికయినా మనసు ఉసూరుమనక మానదు. కేవలం వెయ్యి రూపాయల కోసం ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు అంటే వారికి ఆ చిన్న మొత్తం ఎంత అమూల్యమయిందో అర్ధమవుతుంది.

 

కానీ ప్రతీ రెండు మూడు నెలలకీ ఒకసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేస్తున్నా ఆయనకు చీమ కుట్టినట్లు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ప్రత్యర్ధులు అతని వద్ద లక్షల కోట్ల ఆస్తులు పడున్నాయని ఆరోపిస్తే ఆయన వారి ఆరోపణలకు ఏనాడు నేరుగా జవాబు చెప్పే ప్రయత్నం చేయరు. కానీ వారందరూ కలిసి అమాయకుడయినా తనపై లేనిపోని తప్పుడు కేసులు పెట్టించారని ప్రత్యారోపణలు చేస్తారు. లేకుంటే ఫలానా ఫలానా వాళ్ళ మీద ఆనాడు కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకోలేదా అని వితండవాదం చేస్తారు తప్ప ప్రత్యర్ధులు చేస్తున్న ‘ఆ లక్షల కోట్ల’ ఆస్తుల ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతుంటారు.

 

అయితే ఆయన తన ఆస్తుల గురించి చెప్పుకొన్నా చెప్పుకోకపోయినా, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంతవరకు జగన్ మరియు అతని సహచర సంస్థలకు చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువే రూ. 863 కోట్లుంది. ఈ రోజు తాజాగా మరో 47 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసింది. అంటే మొత్తం రూ.910 కోట్లు అన్నమాట. అయినప్పటికీ జగన్ కి చీమ కుట్టినట్లుగా అయినా ఉందో లేదో తెలియదు. వెయ్యి రూపాయల కోసం పాపం పేదవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొంటుంటే, ఏకంగా రూ. 910 కోట్లు పోయినా చలించకుండా జగన్మోహన్ రెడ్డి తన బిజినెస్సులు, ధర్నాలు నిరాహార దీక్షలు వగైరా అన్నీకార్యక్రమాలు ఏమీ జరగనట్లుగా యధావిధిగా చేసుకుపోతుండటం గమనిస్తే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పేలా లేదు.