TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగాల్ లో ఈసీ వర్సెస్ టీఎంసీ.. ఒక సారి కాదు రోజూ తనిఖీ చేయండంటూ మమత సవాల్

Published on: Thu Apr 16, 2026 10:53AM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో కేవలం తమ పార్టీ నేతల వాహనాలను మాత్రమే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (ఏప్రిల్ 15) ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, తన కారును తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోల్‌కతాలోని డమ్‌డమ్ విమానాశ్రయం సమీపంలో తన వాహనాన్ని నిలిపి  సోదాలు చేసేందుకు అధికారులు సాహసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలకు అంత దమ్ముంటే, తన కారును కేవలం ఒకసారి కాదు..  రోజూ తనిఖీ చేయంని సవాల్ విసిరారు.  ఎన్నికల వేళ కేవలం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు,  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు. 

తాజాగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును కూడా అధికారులు తనిఖీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ, బెంగాల్‌లో టీఎంసీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత మండిపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని అధికారులకు ముఖం మీదే చెప్పానని ఆమె స్పష్టం చేశారు.

బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనూ కేంద్ర బలగాల మోహరింపు, అధికారుల బదిలీలపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి అధికారుల తీరును తప్పుబట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ తనిఖీల పర్వం మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.