జమ్మికుంట సీఐపై ఈసీ వేటు.. గులాబీ పార్టీలో గుబులు..
Published on: Mon Oct 25, 2021 5:28PM
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. మూడు రోజుల్లో ప్రచార గడువు ముగియనుండటంతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నెలకొన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక అధికార పార్టీ విపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ఆరోపణలు ఉండగానే.. జమ్మికుంట సీఐపై వేటు పడింది. జమ్మికుంట పట్టణ సీఐ రామ్ చందర్ రావ్‌పై ఈసీ వేటు వేసింది. రామ్ చందర్ రావ్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కరీంనగర్ ట్రాఫిక్ సీఐ గుర్రం తిరుమల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో సీఐ పై బదిలీ వేటు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతల ఫిర్యాదుతోనే సీఐను బదిలీ చేశారనే చర్చ సాగుతోంది.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేయగానే నియోజకవర్గంలో రాజకీయాలకు దిగింది అధికార పార్టీ, హుజురాబాద్ పరిధిలోని అధికారులను బదిలీ చేసింది. గతంలో పని చేసిన అధికారులు ఈటలకు మద్దతుగా ఉన్నారనే కారణంతో వారందరిని ఉన్న ఫళంగా మార్చేసింది ప్రభుత్వం. ఏసీబీ సహా సీఐలు, ఎస్ఐలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను ట్రాన్స్ ఫర్ చేసింది. వాళ్ల స్థానంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేసేవారిని నియమించారనే విమర్శలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా హుజురాబాద్ పరధిలో అధికారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిందని విపక్షాలు ఆరోపించాయి.
పోలింగ్ కు నాలుగు రోజుల ముందు జమ్మికుంట సీఐపై ఎన్నికల సంఘం బదిలీ వేయడం సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


