సుప్రీం ఆగ్రహం.. యోగి‌, మాయావతిపై ఈసీ నిషేధం

 

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి  ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ ఇరువురు నేతల ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటలు నిషేధం విధించింది.

'మీకు అలీ ఉంటే మాకు బజరంగ్‌బలి ఉన్నారు' అంటూ యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడమేనంటూ ఆయనపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. మాయావతి సైతం మత ప్రాతిపదికపైనే బీజేపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు. యోగికి ఓట్లేసేటప్పుడు అలీ, బజరంగ్‌బలి అంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ముస్లింలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

యోగి ఆదిత్యనాథ్‌, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆ అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. మతపరమైన, సైనికపరమైన, దేశభద్రతకు సంబంధించిన అంశాలపై రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ఇలాంటివి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించింది. దీంతో ఒకట్రెండు గంటల్లోనే ఈసీ చర్యలు చేపట్టింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ఉదయం 6గంటల నుంచి 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలుచేసిన మాయావతిపై 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయవద్దని ఆంక్షలు విధించింది.