ప్రధాని మోదీ చాపర్‌ను తనిఖీ చేసిన ఐఏఎస్ పై వేటు

 

ఒక్కోసారి నిజాయితీగా పనిచేసిన అధికారులపై కూడా నిబంధనల పేరుతో వేటు వేస్తారు. సార్వత్రిక ఎన్నికల వేళ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసారని.. ఓ ఐఏఎస్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.

ఒడిషాలో ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి మొహ్మద్ మోహిసిన్‌ను నియమించారు. 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మోహిసిన్.. తన విధుల్లో భాగంగా ఏకంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను తనిఖీ చేసి.. లేనిపోని కష్టాలు తెచ్చుకున్నారు. ప్రధాని హెలికాఫ్టర్ తనిఖీ చేయడంతో మోహిసిన్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.

ప్రధాని వీవీఐపీ కేటగిరీలోకి వస్తారు. ఆయనకు ఎస్పీజీ రక్షణ ఉంటుంది. ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్నవారికి ఎన్నికల సంఘం తనిఖీల నుంచి మినహాయింపు ఇస్తోంది. మరి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి మోహిసిన్ తెలిసి తనిఖీలు చేశారో లేదా ప్రధాని ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్న వ్యక్తి అని మరిచి చేశారో తెలియదు కానీ మొత్తానికి ఆయన హెలికాఫ్టర్ తనిఖీ చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు.

కాగా.. కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మోదీ హెలికాఫ్టర్లలో పెద్ద మొత్తంలో డబ్బులు తరలిస్తున్నామని ఆరోపించాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని చాపర్‌ నుంచి ఒక పెద్ద నల్ల ట్రంకు పెట్టెను దించి ఒక ప్రైవేట్ వాహనంలోకి ఎక్కిస్తున్న వీడియో బయటపడింది. దీనిపై కూడా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆ పెట్టెలో ఏముందో బయటపెట్టాలని డిమాండ్ చేసాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి ఆవేశంలో ఏకంగా ప్రధాని హెలికాఫ్టర్ తనిఖీ చేసుంటారు. తీరా ఇలా సస్పెన్షన్‌కు గురయ్యారు.