ఈవీఎం ఓపెన్ చేసిన కలెక్టర్ పై వేటు

 

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను సస్పెండ్‌ చేస్తూ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. విపక్షాల ఫిర్యాదుతో కలెక్టర్‌పై ఈసీ వేటు వేసింది. ఈవీఎంలను నిబంధనలకు విరుద్దంగా తెరిచారంటూ కలెక్టర్‌పై గతంలోనే ఫిర్యాదులు రాగా.. ఆయన్ని సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగింది విదితమే. కాగా ఫలితాలపై భిన్న అభిప్రాయాల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు(అభ్యర్థులు) హై కోర్టును ఆశ్రయించారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ కూడా ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వికారాబాద్ ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఓ వైపు ప్రసాద్ కుమార్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను పరిశీలిస్తున్న క్రమంలో కలెక్టర్ ఉమర్ జలీల్.. అన్ని ఈవీఎంలతో పాటు వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కూడా తెరిచారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆ ఈవీఎంలను తెరవడం చట్టప్రకారం తప్పు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ ఘటనపై విచారణ జరిపించారు. ఓ కమిటీ వికారాబాద్ వెళ్లి ఆ రోజు జరిగిన ఘటన వివరాలను సేకరించింది. అయితే కలెక్టర్ మాత్రం హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విషయం తనకు తెలియదని, అందుకే వాటిని తెరిచానంటూ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో కమిటీ సంతృప్తి చెందలేదు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసిందని, అయినా ఆ విషయం తెలియదని కలెక్టర్ చెప్పడం బాధ్యతారాహిత్యంగా భావించి, కలెక్టర్ ని సస్పెండ్ చేయాలని నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్ ని సస్పెండ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.