TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఈసీ స్పందన

Published on: Sat Oct 31, 2020 7:57PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని, మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా? అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఎన్నికల సమయంలో హామీని ఇవ్వడం ద్వారా బీజేపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిందంటూ ఎన్నికల సంఘానికి ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, వివక్షతతో కూడి వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రకటించిన హామీ సరైందా? కాదా? అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. 

 

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ ను బీజేపీ ఉల్లంఘించలేదని తెలిపింది. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. ప్రజలకు సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణ అంశమేనని తెలిపింది. బీజేపీ హామీలో తమకు ఎలాంటి తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది.