వైఎస్సార్‌టీపీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. షర్మిల వెంటే విజయమ్మ..
Published on: Thu Feb 24, 2022 10:02AM
కారణాలు ఏమైనా, జగనన్న కాదన్నా, పెద్దన్న సజ్జల వద్దన్నా లెక్కచేయకుండా, తెలంగాణలో సొంత జెండాను ఎగరేసిన, వైఎస్ షర్మిల...అవరోధాలను అధిగమించి, అనుకున్నది సాధించారు. కనీసం,పార్టీ పేరు వరకు అయినా, వైఎస్సార్ రాజకీయ వారసత్వం తనదే అని షర్మిల నిరుపించుకున్నారు. నిజానికి షర్మిలా ఇంచుమించుగా పదినెలలకు పైగానే తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. గత సంవత్సరం జూలైలో 8న.. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీగా ప్రకటించారు. గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి దరఖాస్తు చేశారు.
అయితే, గతంలో వైఎస్ఆర్ పేరిట పార్టీని రిజిస్టర్ చేసుకున్న కొందరు, ఈసీ వద్ద అభ్యతరం వ్యక్తం చేయడంతో, వైఎస్సార్ టీపీ పేరు విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. కడప జిల్లాకు చెందిన ఇదే వ్యక్తులు, గతంలో జగన్ పార్టీ వైఎస్సార్ సీపీ విషయంలోనూ అభ్యంతారాలు వ్యక్తం చేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు తమ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రిజిస్టర్ చేసుకున్నారు.
అలాగే, షర్మిల పార్టీ విషయంలోనూ ఈసీ పార్టీ పేరును మార్చుకోవాలని, ప్రత్యాన్మాయ పేరు సూచించాలంటూ ఈసీ షర్మిలకు సూచించారు. అయితే చివరికి, ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను షర్మిల పార్టీ ప్రతినిధులను పరిష్కరించడంతో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది.
ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో), రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లేఖ రాసింది. పార్టీకి గుర్తింపు రావడం పట్ల పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి లోటస్‌పాండ్‌లో కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీకి గుర్తింపు రాకుండా కొంతమంది అడ్డుపడ్డారని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పార్టీ గుర్తింపును పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జిల్లాలు, మండ లాలాలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని షర్మిల అన్నారు. అలాగే,ఎమ్మెల్సీ ఎన్నికలు, కొవిడ్ అంక్షల కారణంగా నిలిచిపోయిన పాదయాత్రను షర్మిల మళ్ళీ మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. మార్చ్ 5 నుంచి పాదయాత్ర మల్లె మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
అదలా ఉంటే, ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ, సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలలు పార్టీని బతికించిన షర్మిల, ఇప్పుడు ఆయన వద్దన్నా సొంత పార్టీని స్థాపించడమే కాకుండా, అవరోధాలను అధిగమించి, పార్టీ పేరును నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా, వైసీపీ సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న,తల్లి విజయమ్మ కూడా షర్మిల పక్షం వహించారు. అదే విధంగా బాబాయి వివేక హత్య విచారణ విషయంలోనూ షర్మిల వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు, వైఎస్ కుటుంబంలో, జగన్ ఒంటరి అయినట్లే అంటున్నారు. అలాగే, విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, తెలుస్తోంది. అదే జరిగితే ఇటు కుటుంబంలో , అటు రాజకీయంగానూ జగన్ రెడ్డి కి చిక్కులు తప్పవని అంటున్నారు ..


