గొల్లుమంటున్న గోదావరి..... పాలుపోయనంటున్న వరి
Published on: Thu Mar 29, 2012 11:21AM
గోదావరి ఎడారిగా మారిపోవడంతో ఉభయ గోదావరిజిల్లాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంటకు ముప్పు ఏర్పడింది. ఈ వరి పంటకు గోదావరిద్వారా సీలేరు మీదుగా వచ్చే జలాలే ఆధారం. ప్రస్తుతం రబీ చాలావరకు పాలుపోసుకునే దశలో ఉంది. ఇటువంటి తరుణంలో వరిపంటకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాని గోదావరి ఎండిపోతుండడంతో పాటు సీలేరు నుంచి వస్తున్న నీరు అరకొరగా ఉండటంతో పంట పొలాలకు ముప్పు ఏర్పడింది. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 5260 క్యూసెక్కుల సాగునీటిని అందిస్తుంటే వాటిలో సుమారు 4000 క్యూసెక్కుల నీరు సీలేరు నుంచే వస్తోంది. అయితే సీలేరులో జలాలు ఇప్పటికే అడుగంటాయి. దీనికితోడు గోదావరి నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. దీనివల్ల రబీ పంటకు తగినంత నీరు అందటం లేదు. వరి పాలుపోసుకుంటున్న దశలో సాగునీరుతక్కువగా ఉంటే దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇదే ఉభయ గోదావరి జిల్లాల్లోని వేలాది మంది రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.


