కాంగ్రెస్ కి పెద్ద షాక్.. జనసేనలోకి సీనియర్ నేత

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్.. సుమారు నాలుగేళ్ళ తరువాత ఏపీలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ కూడా అయింది.. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అనే మాటను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. ఓ వైపు ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కి ఊహించని షాక్ తగిలింది.. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ, కాంగ్రెస్ కి బై చెప్పి జనసేనకు జై కొట్టారు.

 

 

కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడుతూ.. గత 32 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో అనేక పదవులు చేపట్టానని, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీలోనే ఉంటూ సేవలందించానని తెలిపారు.. పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతూ వెనుకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.. కాంగ్రెస్‌తో తనకెటువంటి విబేధాలు లేవని... ఒక్క కార్యకర్తను కూడా వెంట తీసుకెళ్లడం లేదన్నారు.. జనసేన పార్టీలో టికెట్‌ ఆశించడం లేదని, కేవలం పవన్‌కల్యాణ్‌ విధివిధానాలు నచ్చినందువల్లే ఆయన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.. పవన్‌ జిల్లా పర్యటన సమయంలో అధికారికంగా చేరతానని చెప్పారు.