ఆప్ఘనిస్థాన్ లో భూకంపం.. 280 మంది మృతి.. భారత్ లోనూ ప్రకంపనలు
Published on: Wed Jun 22, 2022 3:41PM
ఆప్ఘనిస్థాన్ లో భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైన ఈ భూకంపం కారణంగా కనీసం 280 మంది మరణించారు. వేయి మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
బుధవారం ఉదయం సంభవించిన ఈ భూకంప కేంద్రం పాక్ సరిహద్దులోని ఖోస్ట్ నగరానికి 44కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు జియలాజికల్ సర్వే పేర్కంది. ఈ భూకంప ప్రకంపనలు పాకిస్థాన్, భారత్ లోని కొన్ని ప్రాంతాలలో కనిపించినట్లు పేర్కొంది.
పలు భవనాలు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంప ప్రభావం అత్యధికంగా తూర్పు ఆప్ఘనిస్థాన్ లోని పక్తికా ప్రావిన్స్ లోనే ఉందనీ, మృతులంతా ఆ ప్రావిన్స్ కు చెందిన వారేనని పేర్కొన్నారు. రాజధాని నగరంలో కూడా భూమి కంపించిందనీ, అయితే అక్కడ ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదనీ ఆప్ఘన్ అధికారులు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


