హైదరాబాద్‌లో భూకంపం.. వణికిన భాగ్యనగరం

హైదరాబాద్ మహా నగరం ఈ తెల్లవారుజామున వణికింది. నిన్న మధ్యాహ్నం స్వల్ప భూప్రకంపనల తర్వాత.. ఇవాళ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో బోరబండ, రెహమత్ నగర్, యూసఫ్ గూడ, ఇందిరానగర్, ప్రతిభా నగర్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లో నిద్రమత్తులో ఉన్న జనం ప్రాణ భయంతో రోడ్లమీదకు పరుగులు తీశారు. తమ ఇళ్లలోని వస్తువులు కదిలాయని.. గోడలు బీటలు వారాయని పలువురు చెప్పారు. దాదాపు నాలుగైదు గంటల పాటు తాము ఇళ్లల్లోకి ప్రవేశించకుండా భయంతో వీధుల్లో ఉండిపోయామని స్థానికులు అన్నారు. కాగా, రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 2 నుంచి 3 లోపే నమోదయ్యాయని.. వీటి వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.