ఉత్తర తెలంగాణలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు
Published on: Sat Oct 23, 2021 5:18PM
తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అదే అనుమానాలకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా వరదలు పోటెత్తుతున్నాయి. తాజాగా భూ ప్రకంపనలు రావడం కలకలం రేపుతోంది.
దక్షిణ భారతదేశంలోనే ఒక గట్టి పీఠభూమిగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ పరిశోధనల్లో తేలింది. అయితే అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో తెలంగాణలో తరుచూ భూమి కంపిస్తోంది. తాజాగా ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించడంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు.
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలు రామంగుండంలలో భూప్రకంపనలు సంభవించాయి. రామగుండం పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోను స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4 గా నమోదైంది. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కి.మీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
.jpg)
మంచిర్యాల జిల్లాలోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రాంనగర్ గోసేవ మండల్ కాలనీ నస్పూర్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఇళ్లలోంచి పరుగులు తీశారు.భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


