ఎన్టీఆర్ గెలుపు.. చంద్రబాబు ఓటమి.. మరి కేసీఆర్?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడేదైనా హాట్ టాపిక్ ఉందంటే అది తెలంగాణ ముందస్తు గురించే.. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయటమే కాకుండా 105 మంది అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో వందకి పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారం తామే పొందుతామని నమ్మకంగా ఉన్నారు.. అయితే ప్రతిపక్షాలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధం, తెరాసను ఓడిస్తాం అంటున్నాయి.. ఈ ముందస్తులో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ.. తెలుగు రాష్ట్రాలలో ముందస్తు రావడం ఇది మూడోసారి.. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముందస్తు రాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి ముందస్తు రావడం విశేషం.

 

 

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముందస్తుకి వెళ్లి విజయం సాధించగా, రెండోసారి ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు మాత్రం ఓటమి పాలయ్యారు.. 1983 లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ స్థాపించిన తొమ్మిదినెలల్లోనే ఎన్టీఆర్‌ నాయకత్వంలో 201 సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది.. అనంతరం కొద్దికాలానికే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో కేంద్రప్రభుత్వం ఎన్టీఆర్ కు తిరిగి అధికారపగ్గాలు అప్పగించింది.. ఆ సభలో తెలుగుదేశానికి చెందిన అనేకమంది ఫిరాయించడంతో ఎన్టీఆర్ కు ఇబ్బందికరంగా ఉండేది.. దీంతో మరోసారి ప్రజాతీర్పును కోరుతూ 1985లో సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.. 1985లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు.

 

 

తరువాత 2004 లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.. అప్పట్లో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో లోక్‌సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించారు.. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.. దాదాపు 14 ఏళ్ళ తరువాత మళ్ళీ ముందస్తు తెరమీదకు వచ్చింది.. అసెంబ్లీ గడువు ముగిసేందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే సభను రద్దు చేసిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.. అన్నీ అనుకూలిస్తే నవంబర్‌లో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.. మరి ఎన్టీఆర్ కి గెలుపుని, చంద్రబాబుకి ఓటమిని మిగిల్చిన ముందస్తు.. కేసీఆర్ కి గెలుపుని అందిస్తో లేదో తెలియాలంటే కొద్ది నెలలు వేచి చూడాల్సిందే.