దసరా చెప్పే కబుర్లు..

భారతీయ జీవనంలో పండుగలు ముఖ్యమైన భూమికలు. అవి మన జీవితాల్లో సందడిని మాత్రమే కాదు. మనసుల్లోకి వెలుగుని కూడా తీసుకువస్తాయి. అలా దసరా నేర్పే కొన్ని మంచి విషయాలు…

 

దశహర:

రావణాసురుడిని రాముడు దసరా రోజునే సంహరించాడట. దశ కంఠుని హరించాడు కాబట్టి `దశ హర` అనే పేరుమీదుగా దసరా వచ్చిందని కూడా ఓ నమ్మకం. ఇంతకీ రావణాసురునికి పదితలకాయల వెనుక ఏదన్నా అంతరార్థం ఉందా అంటే ఒక్కొక్కరూ తమకి తోచిన జవాబుని చెబుతారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల (మొత్తం కలిపి 10) మీదా అదుపులేనివాడు అన్న సూచనే పది తలలు అని కొందరు; అరిషడ్వర్గాలతో పాటు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలకి పది తలలు ప్రతీక అని మరి కొందరు అంటారు. ఎవరు ఎలా నిర్వచించినా రావణాసురుడు విపరీతమైన అహంకారానికి ప్రతీక అన్నది మాత్రం అందరూ ఒప్పుకునేదే! అలాంటి విపరీతమైన అహంకారం మన పీకలమీదకి వస్తుందనీ, ఆ అహంకారాన్ని జయించిన ప్రతివాడూ దైవసమానుడనీ తెలియచేస్తుంది దసరా!

 

మహిషాసురుడు:

ఒకరిలో చలనం లేకపోతే `దున్నపోతు మీద వానపడినట్లు` అంటాము. ఒకరిలో సంస్కారం లేకపోతే `మనిషా దున్నపోతా!` అని తిట్టుకుంటాం. మొత్తానికి మందకొడితనం, అజ్ఞానం, విచక్షణ లేకపోవడానికి మనం దున్నపోతునే ఉదాహరణగా తీసుకుంటాం. అలాంటి మహిషంతో అమ్మవారు తలపడిన రోజులే ఈ నవరాత్రులు. మన జీవితాల్లోనూ మహిషానికి ప్రతిరూపాలైన లక్షణాలను తరిమికొట్టాలని ఈ పండుగ చెబుతోంది. స్పందించే గుణం, వివేకం లేకపోతే మన జీవితాలు వృథాగా వెల్లమారిపోతాయి కదా!

 

 

అజ్ఞాతవాసం:

మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసాన్ని మరో ఏడు అజ్ఞాతవాసాన్నీ గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపడం కోసం విరాటరాజు కొలువులో, అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాటనగరం మీదకి దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మిచెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ ఆయుధపూజను చేయడం పరిపాటి. ఎంతటివారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమతమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధపూజ చెబుతున్న మాట!

 


 

దసర/సరద: తెలుగులోని పదాలకు దీర్ఘాలు, ఒత్తులు ఉండటం వల్ల వాటిని`జంబిల్‌` చేసే అవకాశం తక్కువ. కానీ దసర అన్న పదాన్ని జంబిల్‌ చేస్తే సరద అని వస్తుంది. దసరా అంటేనే లోకం మొత్తానికీ సరదా కదా! అటు వానాకాలం, ఇటు చలికాలం కాకుండా ప్రకృతి మొత్తం ఆహ్లాదంగా ఉంటుంది. పండుగకి పుట్టిళ్లు చేరుకున్న ఆడపడుచులతో గడపలన్నీ కళకళలాడతాయి. ప్రతీ ప్రాంతం వాళ్లూ తమకి తోచిన రీతిలో పండుగను జరుపుకొంటారు. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు, విజయనగరంలో సిరిమాను సంబరాలు, కృష్ణాజిల్లాలో శక్తిపటాలు, బెంగాల్లో అమ్మవారి పందిళ్లు, తమిళనాడులో బొమ్మల కొలువులు… ఇలా పదిరోజుల పండుగని ధూంధాంగా చేసుకుంటారు జనం. ఆ పండుగ సందడి కలకాలం నిలవాలనీ, జీవితం సరదా సరదాగా గడిచిపోవాలనీ కోరుకుంటోంది దసర!

 

- నిర్జర.