కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఎం.పద్మ నియామకం...


విజ‌య‌వాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఐఏఎస్‌ అధికారిణి ఎం.పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎం.పద్మను కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలు జరిగాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు ఆగుడి ఈవోగా ఉన్న సూర్యకుమారిని బాధ్యతల నుండి తప్పించారు. ఆ తరువాత దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనూరాధకు తాత్కాలికంగా అప్పగించారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మొత్తం నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన నేపథ్యంలో దుర్గగుడికి పూర్తిస్థాయి ఈవోగా పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఆమెకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల‌ను కూడా అప్పగించారు.