ఎమ్మెల్యే దంపతుల ఔదార్యం.. అమ్మాయి ప్రేమ వివాహం
Published on: Thu May 30, 2019 5:07PM

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు దర్శనమిచ్చి, తరువాత వారి మంచి చెడులు పట్టించుకోని నాయకులున్న ఈరోజుల్లో.. ఓ నాయకుడు మాత్రం కష్టాల్లో ఉన్న ఓ అమ్మాయికి తండ్రిలా అండగా ఉండి, చదివించి, పెళ్లి జరిపించి తన మంచి మనసుని చాటుకున్నాడు. ఆయనే తెలంగాణలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.
సిద్ధిపేట జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఉండే సావిత్రికి, కామారెడ్డి మండలానికి చెందిన సాయాగౌడ్ కు పెళ్లయింది. వీరికి రేఖ అనే పాప పుట్టింది. అయితే ఎనిమిదేళ్ల కిందట సాయాగౌడ్ తన భార్యను విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా హత్యచేసినట్టు ఊరంతా గుప్పుమంది. అంతేకాకుండా, 17 ఏళ్ల వయసున్న తన కుమార్తెను మరొకరికి విక్రయించాలని ప్రయత్నించాడు. దాంతో రేఖ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆశ్రయించగా, ఆయన తన భార్య సుజాత సమ్మతి తీసుకుని ఆ బాలిక సంరక్షణను స్వీకరించారు.
రేఖను తండ్రి సాయాగౌడ్ చెర నుంచి విడిపించిన సోలిపేట దంపతులు ఆమెను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చంతా తామే భరించారు. వారి ఔదార్యం, రేఖ కష్టం ఫలించి ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అదే సంస్థలో పనిచేస్తున్న సురేష్ అనే యువకుడిని తాను ఇష్టపడ్డానని రేఖ ఎమ్మెల్యే దంపతులకు చెప్పగా, వాళ్లు పెద్దమనసుతో ప్రేమ వివాహం జరిపించారు. ఎమ్మెల్యే దంపతుల మంచి మనసుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


