చెరుకుతో లాభమెవరికి! కేసీఆర్ అలా ప్లాన్ చేశారా?
Published on: Tue Oct 6, 2020 12:21PM
సిద్దిపేట జిల్లా దుబ్బాకకు జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా రోజుకో వ్యూహాన్ని మార్చుతూ ఇతర పార్టీల కంటే ముందుండే ప్రయత్నం చేస్తున్నాయి. ఉప ఎన్నికలో పోటీ చేసే అధికార టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. అధికార పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణ సుజాత పోటీ చేయబోతుండగా.. బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత రఘునందన్ రావు ఉండబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ప్రకటిస్తారని ప్రచారం జరిగినా.. తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. తనకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని ఆ పార్టీ పెద్దలతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. చెరుకును అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. చెరుకు రాజీనామాతో అధికార పార్టీకి షాక్ తగులుతుందని అంతా భావించారు. అయితే దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం మరో ప్రచారం జరుగుతోంది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే.. టీఆర్ఎస్ కన్నా బీజేపీకే ఎక్కువ నష్టమనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారనే గుసగుసలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.
సీఎం కేసీఆర్, హరీష్ రావులతో చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలో శ్రీనివాస్ రెడ్డి టికెట్ అడుగుతున్నా.. ఆయనను కూల్ చేయడం కేసీఆర్ కు కష్టం కాదని చెబుతున్నారు. ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఆయనను రేసు నుంచి తప్పించవచ్చంటున్నారు. అయితే దుబ్బాకలో ఎన్నిక ఇబ్బందిగా మారడం వల్లే.. చెరుకును ముందు పెట్టి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి శ్రీినవాస్ రెడ్డి మళ్లీ అధికార పార్టీలో చేరుతారనే చర్చ జరుగుతోంది. 2023 ఎన్నికల్లో ఆయనకే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి..సోలిపేట ఫ్యామిలీని మండలికి పంపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని చెరుకుకు కూడా చెప్పినట్లు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ ప్రచారంలో ముందుంది. రెండు నెలల నుంచే రఘునందన్ రావు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేశారు. ఇటీవల బీజేపీలోకి వలసలు కూడా పెరిగాయి. యూత్ ఎక్కువగా కమలం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు రఘునందన్ రావు ప్రయత్నిస్తున్నారు. దుబ్బాకలో పరిస్థితిని అంచనా వేసిన కేసీఆర్.. కొత్త ప్లాన్ వేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి రంగంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుందని కేసీఆర్ వ్యూహమని తెలుస్తోంది. కాంగ్రెస్ బలహీన క్యాండెట్ ను పోటీ లో పెడితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా బీజేపీకి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్.. ఇలా నరుక్కొచ్చారని చెబుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ భవిష్యత్ కు అత్యంత కీలకంగా మారింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా.. ఇటీవల బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసుకోవాలని భావిస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే.. కాంగ్రెస్ కు గండమే. కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. దీంతో కేసీఆర్ ను వ్యతిరేకించేవారంతా గంపగుత్తగా కమలానికి దగ్గరయ్యే అవకాశాలుంటాయి. అదే జరిగితే తమ పార్టీ భవిష్యతే కష్టమని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారని చెబుతున్నారు.
దుబ్బాకలో బీజేపీకి బ్రేకులు వేయడమే ఇప్పుడు కాంగ్రెస్ కు ముఖ్యం. ఎందుకంటే టీఆర్ఎస్ గెలిచినా.. అధికార పార్టీతో పాటు చనిపోయిన ఎమ్మెల్యే సెంటిమెంట్ తో గెలిచిందని చెప్పుకోవడానికి ఆ పార్టీకి ఛాన్స్ ఉంటుంది. బీజేపీ గెలిచినా... రెండో స్థానంలో నిలిచినా కాంగ్రెస్ కు కష్టకాలమే. అందుకే బీజేపీకి పడే ఓట్లను చీల్చడం ద్వారా.. ఆ పార్టీని వెనక్కి నెట్టవచ్చని హస్తం పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే.. ఆయన బలమైన అభ్యర్థి అవుతారని, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు తమకే వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో గట్టి పోటీ ఇస్తామని.. గెలవకపోయినా రెండో స్థానంలో నిలవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే అన్ని అంశాలు పరిశీలించాకే చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు పీసీసీ పెద్దలు చెబుతున్నారు.
దుబ్బాకలో గెలుపుపై ఇంతకాలం ధీమాగా ఉన్న బీజేపీ.. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్జి ఉంటే మాత్రం కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందన్న ఇంటిలిజెన్స్ సమాచారంతోనే కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని కమలనాధులు ఆరోపిస్తున్నారు.కేసీఆర్ ట్రాప్ లో కాంగ్రెస్ నేతలు పడిపోయారని చెబుతున్నారు. మొత్తానికి అన్ని పార్టీలకు సవాల్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో పోలింగ్ నాటికి ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి మరీ...


