TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో తాగి నడిపేవాళ్లని పట్టుకునేది ఎలా..?

Published on: Mon Jul 18, 2016 4:23PM

హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి సహా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంతటి విషాదానికి కారణం మద్యం..తాగి వాహనాలు నడపడం. ఈ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పెషల్ డ్రైవ్‌ల పేరిట హడావిడి చేయడం మొదలెట్టారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తెలంగాణ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా నిద్రలేచింది. అయితే పాపం వారికి మద్యం తాగిన వాళ్లను గుర్తించడం కష్టంగా మారింది. ఎందుకంటే డ్రంకన్ డ్రైవ్ చేసే వారిని గుర్తించే అత్యాధునిక బ్రీత్ అనలైజర్ల కొరత ఏపీ పోలీస్ శాఖను తీవ్రంగా వేధిస్తోంది.

 

రాష్ట్రంలో మొత్తం 1015 పోలీస్ స్టేషన్లు ఉండగా కేవలం 250 పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కువ శాతం పాతవి కావడంతో తనిఖీల సందర్భంలో మొరాయిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో రాష్ట్రంలో గత రెండేళ్లలో సగటున ఇద్దరు గాయపడగా, రెండు రోజులకొకరు ప్రాణాలు కోల్పోయారు. గత 17 నెలల వ్యవధిలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ లక్ష మందికి పైగా పట్టుబడ్డారు.

 

తనిఖీలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పరికరాల కొరత కూడా అడ్డంకిగా మారింది. కొత్తగా 1200  బ్రీత్ ఎన్‌లైజర్లు కొనుగోలు చేయాలని ఏపీ పోలీస్ విభాగం ప్రతిపాదనలు పంపింది. ఉన్నవాటిలో సరిగా పనిచేసే వాటితోనే అప్పుడప్పుడూ మందుబాబులను పసిగడుతున్నారు తప్ప ప్రతి రోజు ఖచ్చితంగా తనిఖీలు చేయ్యాలంటే అది కుదరని పనే. బ్రీత్ ఎనలైజర్లలో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, వాటిని సరిచేసే పరిస్థితి లేదు. ఏదైనా లోపం వస్తే అలాగే వాటిని మూలకు చేరుస్తున్నారు. వీటిని భద్రపరిచే విధానంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో లెక్కలో ఉన్నవి కూడా అవసరానికి అక్కరకు రాకుండా పోతున్నాయి.