మోడ్రన్ డ్రగ్ మాఫియా… ఇంటర్నెట్ నుంచీ ఇంటికే డ్రగ్స్!

 

డ్రగ్స్ దందా అనగానే ఇప్పుడు అందరి కళ్ల ముందూ సినిమా సెలబ్రిటీలు కదులుతున్నారు. నిజంగా పూరీ టూ రవితేజ … డ్రగ్స్ వాడారో, కొన్నారో, అమ్మారో మనకు తెలియదు కాని.. కాన్సన్ ట్రేషన్ అంతా వారి మీదకి మళ్లిపోయింది! డ్రగ్స్ కంటే సినిమా గ్లామరే ఎక్కువ కిక్ ఇస్తోంది మీడియాకి, జనానికి! కాని, హైద్రాబాద్ డ్రగ్స్ సప్లైకి, అంతర్జాతీయ మాఫియాకి సంబంధాలు వుండటం మనం నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం…

 

తెలంగాణ ప్రభుత్వం తాజాగా డార్క్ నెట్ వెబ్ సర్వర్లను నిషేధించాలని అమెరికాను కోరింది. ఎంబసీ ద్వారా, ఇంటర్ పోల్ ద్వారా కూడా యూఎస్ గవర్నమెంట్ కి ఈ విషయంలో వినతి చేసింది. ఇంతకీ డార్క్ నెట్ వెబ్ సర్వర్లు అంటే ఏంటి? ఇప్పుడు హైద్రాబాద్ లో చేతులు మారుతున్న డ్రగ్స్ కి కారణం ఈ సర్వర్లే! ఎక్కడో అమెరికా, లండన్లలో ఈ వెబ్ సైట్లు తమ సర్వర్లు ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ నుంచీ ప్రపంచ వ్యాప్తంగా దందా చేస్తుంటాయి. డ్రగ్స్ కు సంబంధించి బుకింగ్స్ తీసుకోవటం, డబ్బులు తీసుకోవటం, డ్రగ్స్ ఫలానా అడ్రస్ కు పంపటం అంతా అన్ లైనే అన్నమాట!

 

వివిధ పేర్లతో నడిచే డార్క్ నెట్ వెబ్ సైట్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… అవ్వి డ్రగ్స్ వాడే వారికి, కొనే వారికి అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ లాంటివన్నమాట! హ్యాపీగా డ్రగ్స్ ఇంటికే తెప్పించేసుకుంటున్నారు డ్రగ్స్ దందాలో మునిగితేలేవారు. అందుకే, ఎక్కడా పోలీసులకి పెద్దగా పట్టుబడకుండా చాలా కాలం వ్యవహారం నడిచిపోతోంది. ఇప్పుడు స్కూలు పిల్లలు మొదలు సినిమా వాళ్ల దాకా చాలా మంది దీనికి బలైపోతున్నారని తెలిసి ప్రభుత్వం అమెరికాను రిక్వెస్ట్ చేసేదాకా వెళ్లింది!

 

తెలంగాణ ప్రభుత్వం నిలిపేయాలని కోరిన డార్క్ నెట్ సర్వర్లని అమెరికా క్లోజ్ చేస్తుందో లేదోగాని… ఇక్కడి స్థానిక యంత్రాంగమైతే మరింత సీరియస్ గా వుండాలి. ఇప్పుడంటే రోజుకో సినిమా సెలబ్రిటీ సిట్ విచారణతో కాలం గడిచిపోతుంది కాని… దీర్ఘ కాలంలో డ్రగ్స్ దుష్ప్రభావం హైద్రాబాద్ మీదా, తెలుగు రాష్ట్రాల మీద పడకూడదంటే పోలీసులు, ఎక్పైజ్ శాఖా అత్యంత అప్రమత్తంగా వుండాలి. ఆన్ లైన్ నుంచి ఆన్ రోడ్ దాకా డ్రగ్స్ ఎక్కడ వున్నా పసిగట్టి పట్టుకోవాలి. లేదంటే పంజాబ్ లో మాదిరిగా పరిస్థితులు చేజాదాటిపోయే ప్రమాదం వుంది.

 

డ్రగ్స్ సమస్య పైకి కనిపిస్తున్నంత చిన్నదేం కాదు. ప్రపంచంలోని కొన్ని దేశాల ఆర్దిక వ్యవస్థలే డ్రగ్స్ దెబ్బకి కుప్పకూలిపోయిన దాఖలాలు వున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా నిరంతరం అలెర్ట్ గా వుంటూ డ్రగ్స్ పై పోరు సాగిస్తూనే వుంటుంది. అలా ఆగిపోని యుద్దం చేయటమొక్కటే మార్గం…