ఎవరీ ద్రౌపది ముర్ము.. ఏమిటామె కథ!
Published on: Wed Jun 22, 2022 2:50PM
రాష్ట్రపతి అభ్యర్థిగా పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికి ప్రధాని మోదీ అండ్ కో మాత్రం.. చివరి నిమిషంలో ద్రౌపది ముర్ము వైపు మొగ్గు చూపారు. దీంతో అధికార ఎన్డీఏ కూటమి.. తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని బరిలో నిలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఇటీవల పలువురి పేర్లు వినిపించినాయి... వాటిలో ద్రౌపది ముర్ము పేరు కూడా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని సైతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రకటించే అవకాశం ఉందనే ఓ వార్త మంగళవారం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. అయితే చివరినిమిషంలో మోదీ అండ్ కో.. ద్రౌపది ముర్ముని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి గల రిజన్.. రిజనింగ్ ఏమిటీ.. ఇంతకీ ఆమె ఎవరు ?.. ఆమె స్వస్థలం ఎక్కడ?... ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? తదితర విషయాలు తెలుసుకొనేందుకు నెటిజన్లు.. గుగూల్‌లో తెగ సెర్చి వెతికేస్తున్నారు.
ఆ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురించిన వివరాలు క్లుప్తంగా.. భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒడిశా ఒకటి. అలాంటి రాష్ట్రంలో మరింత వెనకబడిన జిల్లాల్లో మయూర్ భంజ్ ఒకటి. ఆ జిల్లాలోని బైడపోసి గ్రామంలో 1958, జూన్ 20 ద్రౌపది ముర్ము ఓ పేద కుటుంబంలో జన్మించారు. గిరిజనుల్లోని సంథాల్ తెగకు చెందిన ఆమె పేదరికపు అడ్డంకులను వరుసగా అధిగమిస్తూ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రమాదేవి డిగ్రీ కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసి.. సాగునీరు, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయులురాలిగా ఆమె స్వచ్ఛందంగా పని చేశారు.
అనంతరం 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత అంటే 2000లో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు.. నాడు అంటే 2000 - 2004 మధ్య నాటి బిజూ జనతాదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా, మత్స్య, వాణిజ్య శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2004లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో ఒడిశాలో ఉత్తమ పని తీరు కనబరిచిన ఎమ్మెల్యేలకు ఇచ్చే నీలకంఠ అవార్డును ఆమె 2007లో అందుకున్నారు.
ఈ ద్రౌపది పని తీరును గమనించిన కమలదళం ఆమెకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్ష, ఉపాధ్యక్షరాలిగా కీలక బాధ్యతలు అప్పగించింది. అలాగే 2010, 2013లో మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అనంతరం బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమెను కమలం పార్టీ నియమించింది. 2015, మే 18న ద్రౌపది జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపతి ముర్ము చరిత్ర సృష్టించారు.
మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఎన్డీఏ కూటమికి అత్యధిక బలం ఉంది. అలాగే మోదీ ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లోని బీజేపీ యేతర ప్రభుత్వాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక నల్లేరు మీద నడకే అని రాజకీయ మేధావులు సైతం స్పష్టం చేస్తున్నారు. అయితే ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా ఆమె ఖ్యాతి గాంచనున్నారు. అయితే ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించిన వారే కావడం గమనార్హం.
ఇంకోవైపు ద్రౌపది ముర్ము.. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారని. ఆమె బంధువులు పేర్కొంటున్నారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. అయితే ద్రౌపది భర్తతోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే మరణించారని వారు చెబుతారు. భర్త, ఇద్దరు కుమారులు మరణించడంతో.. ద్రౌపది తన కుమార్తె ఇతిశ్రీనే సర్వస్వం అయిందని.. ఇతిశ్రీకి వివాహం అయి.. ఆమెకు ఓ పాప కూడా ఉందని వారు పేర్కొంటారు. ఇటీవలే ద్రౌపది ముర్ము.. తన 64వ పుట్టిన రోజును జరుపుకున్నారు. పుట్టిన రోజు జరుపుకున్న మరునాడే.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం పట్ల ద్రౌపది ముర్ము... సంతోషం వ్యక్తం చేశారు.


