TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దిల్లీలో నీటి కటకట- ఇళ్లు వదిలి వెళ్తున్న పౌరులు!

Published on: Mon Feb 29, 2016 9:42AM


 

దేశ రాజధాని దిల్లీ నీటికి అల్లల్లాడిపోతోంది. దిల్లీలోని పాలం, ద్వారక వంటి ప్రాంతాలలోని ప్రజలకు రోజుల తరబడి నీరు లభించడం లేదు. ఈ బాధని తట్టుకోలేక కొందరు గృహస్తులు ఏకంగా ఇంటిని వదిలి హోటళ్లలో సమయాన్ని గడిపేందుకు సిద్ధమవుతున్నారట! దిల్లీకి మంచినీటిని అందించే మునక్‌ కాలువని హర్యానాలోని జాట్ వర్గపు ఆందోళనకారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దానిని ఇలా పునరుద్ధరించారో లేదు, తిరిగి అందులోకి నీరు పారిశ్రామిక వ్యర్థాల వల్ల కలుషితమైపోయిందన్న వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి మునక్‌ నుంచి వచ్చే నీటి సరఫరాను నిలిపివేశారు. దిల్లీకి అవసరమయ్యే నీటిలో దాదాపు 60 శాతం నీరు ఈ మునక్‌ కాలువ నుంచి లభిస్తుంది.

 

మిగతా నీరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువగంగ కాలువ నుంచి లభిస్తుంది. దిల్లీకి రోజువారీ అవసరమయ్యే వందలకొద్దీ గ్యాలన్ల నీటిలో కేవలం 15 శాతం మాత్రమే దిల్లీలో దొరుకుతుంది. మరోపక్క పెరిగిపోతున్న జనాభా కారణంగా, తరిగిపోతున్న భూగర్భ జలాల కారణంగా... అక్కడి పౌరులంతా కూడా ప్రభుత్వం అందించే నీటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. నీటి విషయంలో దిల్లీకి తనకంటూ స్వయం ప్రతిపత్తి లేకపోవడంతో, రాబోయే రోజులలో నీటి పరిస్థితి మరీ దారుణంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది.