సత్యసాయి ట్రస్టు పోకడపై వీడని సందేహాలు?
Published on: Mon Apr 30, 2012 1:29PM
పుట్టపర్తి సత్యసాయి బాబా మరణాంతరం సత్యసాయి ట్రస్టుపై అనుమానపు పొరలు కమ్ముకున్నాయి. భక్తులు సైతం ఈ ట్రస్టు నిర్వాహకులను సందేహించారు. బంగారం తరలింపు, ఆస్తుల అన్యాక్రాంతం వంటి పలురకాల సంఘటనలు మీడియా ద్వారా వెలుగుచూశాయి. తాము సత్యసాయిలో భగవంతున్ని చూస్తే ఇప్పుడు ట్రస్టులో స్వార్థశక్తులను గమనించామని సత్యసాయి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలకాలంలో మీడియాలో సత్యసాయి ట్రస్టుకు సంబంధించిన కార్యకలాపాలు అస్సలు ప్రచారానికి నోచుకోలేదు.
దీంతో కొందరు భక్తులు ఈ ట్రస్టుపై దృష్టిసారించటం మానేశారు. కానీ, బాబా ఆస్తులు అన్యాక్రాంతమైతే చూస్తుండలేమని కొందరు భక్తులు ట్రస్టు సభ్యులను నిలదీశారు. ఇంకా ఆ నిలదీతలు కొనసాగుతున్నందునే ట్రస్టులో కీలకసభ్యుడు ఎస్.ఎస్.రత్నాకర్ మొత్తం ట్రస్టు సభ్యులందరూ సమైక్యంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాబా ఆశయాల మేరకు 118 గ్రామాల్లో మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ప్రకటించారు. పైగా 80కోట్ల రూపాయలను దీనికోసం వెచ్చించామని ప్రకటించారు. ఇటువంటి ప్రకటనల ద్వారా భక్తులకు ట్రస్టుపై నమ్మకం పెంచాలని రత్నాకర్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా అన్నదానం, వస్త్రదానం వంటి కార్యక్రమాల ద్వారా భక్తుల నమ్మకాన్ని పెంచేందుకు ట్రస్టు సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా బాబా మరనానతరం ట్రస్టు భక్తుల నమ్మకాన్ని పొందలేకపోయిందనేది నిర్వివాదాంశం.


