TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డేంజ‌ర‌స్ బ్లాక్‌ ఫంగస్‌.. చేయాల్సిన‌వి.. చేయ‌కూడ‌నివి..

Published on: Wed May 19, 2021 10:21AM

క‌రోనాతో పాటే ఏపీలో బ్లాక్ ఫంగ‌స్(మ్యుకోర్‌మైకోసిస్‌) సైతం వేగంగా వ్యాపిస్తోంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో బాధితుల‌కు బ్లాక్ ఫంగ‌స్ సోకింది. బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో సైతం చేర్చారంటే.. ఇదెంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవ‌చ్చు. 

వైరస్‌ బారిన పడి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారికి చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదంగా మారుతోంది. ఫంగస్‌ సోకిన వారిలో మరణాలు 50 శాతంగా ఉన్నాయి. అంటే ప్రతి ఇద్దరు బాధితుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. 

బ్లాక్ ఫంగస్‌ సోకిన వారికి తలనొప్పి, ముక్కు దిబ్బడ, జ్వరం, కంటిచూపు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. రోజురోజుకూ ఈ ఫంగస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ పలు సూచనలు చేశాయి. త్వరగా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడం, అవగాహన పెంచుకోవడం ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు.

కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ పెరిగిపోవడానికి స్టెరాయిడ్ల దుర్వినియోగం కూడా కారణమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. ‘‘ఈ ఫంగస్‌ ముఖంపై ప్రభావం చూపుతుంది. కంటిచూపు కోల్పోయేందుకు కారణమవుతోంది. మెదడుకూ చేరుతోంది’’ అని గులేరియా తెలిపారు. ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. గాలి పీల్చుకున్నప్పుడు మ్యుకోర్‌ అనే ఫంగస్‌ సైనస్‌ లేదా ఊపిరితిత్తుల్లో చేరుతుంది. 

చేయాల్సిన‌వి...
కరోనా నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి. 
రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 
స్టెరాయిడ్లను తగిన మోతాదులో తీసుకోవాలి. 
యాంటీబయాటిక్‌లు, యాంటీఫంగల్స్ మందుల‌ను తగిన మోతాదులో వాడాలి. 
ఆక్సిజన్‌ థెరపీ సమయంలో తేమ కోసం శుభ్రమైన నీటినే ఉపయోగించాలి. 

చేయకూడనివి...
ఫంగ్‌సకు సంబంధించిన సంకేతాలు, లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.
ముక్కుదిబ్బడ చేసిన ప్రతి కేసునూ బ్యాక్టీరియా సైనసైటిస్‌ కేసులుగా పరిగణించవద్దు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా కొవిడ్‌ రోగులు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. 
ఫంగ్‌సను గుర్తించడానికి అవసరమైన విస్తృత పరీక్షలకు వెనకాడవద్దు. 
బ్లాక్‌ఫంగ్‌సకు ప్రాథమికంగా చికిత్సను ప్రారంభించే కీలకమైన సమయాన్ని కోల్పోవద్దు. 

నివారణా చర్యలివే..
రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టిక, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
ఎల్లప్పుడూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. 
బయటకు వెళ్లినప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా చూసుకోవాలి. 
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 
ఆరోగ్యం, మందుల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి.
బ్లాక్‌ ఫంగ్‌సను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.