కిమ్‌, ట్రంప్‌లు కలిస్తే మనకేంటి లాభం?

 

ఉత్తర కొరియా నియంత కిమ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు ఇవాళ సింగపూర్‌లో కలుస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా... ఉత్తర కొరియా, అణ్వాయుధాలని టపాసులు పేల్చినంత తేలికగా పరీక్షిస్తోంది. తమ అణ్వాస్త్రాలు అమెరికా వరకు వెళ్తాయని కాలు రువ్వుతోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికాలు చేసిన హెచ్చరికలను కానీ విధించిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కిమ్‌ ప్రపంచానికే పక్కలో బల్లెంలా తయారయ్యారు.

అలాంటి కిమ్‌ ఇప్పుడు అకస్మాత్తుగా తెల్లజెండా ఊపడం, ప్రపంచ రాజ్యాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సహజంగానే అమెరికా ఈ చర్యతో తబ్బిబ్బైపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడెప్పుడు కిమ్‌ని కలిసి శాంతి మంత్రాలు పఠిద్దామా అని తొందరలో ఉన్నారు. ఆ ముహూర్తాన్ని సింగపూర్‌లో ఇవాళ నిర్ణయించారు. నిజానికి పైకి శాంతి ఒప్పందంలా కనిపించే ఈ చర్య వెనుక ఎవరి ఉద్దేశాలు వాళ్లకి ఉన్నాయి.

తమ దేశం ఇక మీదట అణ్వస్త్రాల జోలికి పోదని కిమ్‌ ఒప్పుకోవడం అంటే... ‘మాకు కావల్సిన ఆర్థిక లాభాలు మాకు అందచేస్తే, మేము ప్రశాంతంగా ఉంటాం’ అని చెప్పడం. మరోవైపు ఉత్తర కొరియా అణ్వస్త్రాల జోలికి పోకూడదని అమెరికా కోరుతోందంటే, ఆ దేశానికి ఉన్న శాంతికాముకత్వంతో కాదు- ‘ఉత్తర కొరియా ఎక్కడ ఎప్పుడు తమ మీద ముంచుకు వస్తుందో! తమ ఆయుధ వ్యాపారానికి ఎక్కడ గండి కొడుతుందో’ అన్న అనుమానంతోనే! అంటే శాంతి ముసుగులో ఈ రెండు దేశాలూ తమకి కావల్సిన లాభాన్ని ఆశిస్తున్నాయన్నమాట!

కిమ్‌, ట్రంప్‌లు కలుస్తున్నారన్న వార్తని మన పత్రికలు పతాక శీర్షికలలో ప్రచురించాయి. ఆ కలయిక వెనుక ఉన్న ఉద్దేశాన్ని చాలా కొద్ది పత్రికలు మాత్రమే ప్రస్తావించాయి. ఇక ఈ కలయిక వల్ల మన దేశానికి ఎలాంటి లాభం అన్న విషయం జోలికి చాలా పత్రికలు పోనేపోలేదు. కిమ్‌ వాడే టాయిలెట్‌, ఆయన కోసం వండే ఆహారం, ఆయన భద్రతలను దాటి చాలా పత్రికలు ఆలోచించనేలేదు.

ఈ రోజున ఉత్తరకొరియా అణ్వస్త్ర బూచిన చూపించి ప్రపంచాన్నే వణికిస్తోందంటే దానికి కారణం పాకిస్థానే! పెద్దగా అణు విజ్ఞానం లేని ఉత్తర కొరియాకు కావల్సిన సాంకేతిక సమాచారాన్ని ఇచ్చింది పాకిస్థానే అని రక్షణ నిపుణులు చెబుతారు. కేవలం సాంకేతికతే కాదు, ఆ సాంకేతికతను పరీక్షించేందుకు కావల్సిన ముడిసామాగ్రిని కూడా పాకిస్థానే సమకూర్చిందని ఏకంగా అమెరికానే ఆరోపిస్తోంది. పాకిస్థాన్‌ అణుపితామహుడిగా పేరొందిన ఏ.క్యూ.ఖాన్‌, ఉత్తరకొరియాకి వెళ్లిమరీ వాళ్లకి అణు విధ్వంసం మీద పాఠాలు నేర్పించారు. ఆ సలహాలు, సాంకేతికత, సామగ్రిలతోనే 2006లో ఉత్తర కొరియా తొలిసారి అణుబాంబుని పరీక్షించింది. ఇప్పుడు ఉత్తరకొరియా ఏకంగా హైడ్రోజన్‌ బాంబునే పరీక్షించే స్థాయికి చేరుకుంది. తనకి ఒకప్పుడు సాయం చేసిన పాకిస్థాన్‌కు తిరిగి సాయం చేసే స్థాయిలో ఉంది. ఏకంగా అమెరికానే భయపెట్టే పరిస్థితికి వచ్చింది. ట్రంప్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కి కాస్త ప్రతికూలంగా మారేందుకు ఉత్తరకొరియా వెనుక ఆ దేశం ఉండటం కూడా ఓ కారణమే!

కిమ్‌, ట్రంప్‌ల మధ్య జరిగే చర్చల తర్వాత ఉత్తర కొరియా అణ్వస్త్ర దూకుడు చాలా వరకు తగ్గవచ్చు. అది పాకిస్థాన్ అణువ్యాపారాల మీద కూడా ప్రభావం చూపుతుంది. తన అణు సాంకేతితను అమ్ముకుని ఆర్థికంగా లాభపడేందుకు, హైడ్రోజన్‌ బాంబు వంటి సాంకేతికతను అందుకుని రక్షణపరంగా బలపడేందుకు పాకిస్థాన్‌కి కుదరదు. ప్రపంచదేశాల మధ్య ఏకాకికగా ఉంటున్న పాకిస్థాన్‌కు ఇప్పటివరకు చైనా, ఉత్తర కొరియాలు కాస్త మద్దతుగా నిలిచేవి. ఇక మీదట ఉత్తర కొరియా కూడా కాస్త లౌక్యంగా వ్యవహరించవచ్చు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను ప్రపంచం మీదకు ఉసిగొల్పినట్లుగానే, ఉత్తరకొరియాని అడ్డుపెట్టుకుని ప్రపంచదేశాలని ఆడిద్దామనుకునే వ్యూహం ఇకపై సాగదు. ఒక్కమాటలో పాకిస్థాన్‌ చదరంగంలోంచి ఒక పావు ఎగిరిపోయినట్లే!

2010లో ఉత్తరకొరియా కరువుతో అల్లాడుతుంటే మన దేశం ఒక్కటే సాయపడేందుకు సిద్ధమైంది. టన్నుల కొద్దీ ఆహారధాన్యాలు పంపి ఆ దేశాన్ని ఆదుకొంది. అధికారంగా ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని అంగీకరించిన దేశాలలో మన దేశం కూడా ఒకటి. మన దేశం చొరవతోనే ఉత్తరకొరియా, ఐక్యరాజ్యసమితిలో చోటు సంపాదించుకొంది. ఈ విషయాలన్నీ ఉత్తర కొరియా జ్ఞాపకాలలో ఉంటే కనుక ఇక మీదట పాకిస్థాన్‌కంటే మనవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.