కేసుల నుండి తప్పించుకోవడాని ట్రంప్ భారీ ఆఫర్...


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన యూనివర్శిటీపై ఉన్న కేసుల సెటిల్ మెంట్ల కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ యూనివర్శిటీపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుల విముక్తి కోసం ఆయన భారీ మొత్తంలోనే ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. మూడు కేసుల సెటిల్ మెంట్ కోసం ఆయన 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 170 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించారట. అయితే రెండు కేసుల్లో మాత్రమే రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షినైడర్ మ్యాన్ తెలిపారు. మూడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసులో వాది, ప్రతివాదుల మధ్య డీల్ కుదిరిందని వెల్లడించారు.

 

అయితే నిర్మాణ రంగంలో నిష్ణాతులను చేస్తామని చెబుతూ, ఒక్కొక్కరి నుంచి 35 వేల డాలర్లను కట్టించుకున్న యూనివర్శిటీ సరిగ్గా పాఠాలు చెప్పలేదని, ఈ స్టడీ ప్రోగ్రామ్ తమను తప్పుదారి పట్టించిందని విద్యార్థులు కోర్టు కెక్కారు. ఈ కేసులో ట్రంప్ వర్శిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు ఉండటం, విద్యార్థులు నెగ్గితే, అధ్యక్ష హోదాలో పరువు పోతుందని భావించడంతోనే ఆయన భారీగా డబ్బు చెల్లించి కేసుల నుంచి బయటపడాలని భావించినట్టు తెలుస్తోంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.