పొలిటీషన్ లా మాయ చేస్తూ… బిజినెస్ మ్యాన్ లా డీల్స్ సైన్ చేస్తోన్న ట్రంప్!

 

ట్రంప్ అమెరికా దాటి బయట ప్రపంచంలోకి వచ్చాడు. తొలిసారి ఒక విదేశీ పర్యటనకి శ్రీకారం చుట్టిన ఆయన అమెరికాలో మాట్లాడినంత ఘాటుగా టెర్రరిజమ్ గురించి మాట్లాడలేదు. అలాగని, ట్రంప్ తన శైలి మార్చేసుకున్నాడని అనుకోటానికి వీల్లేదు. ఇస్లామిక్ ఉగ్రవాదం అంటూ ఎన్నికల్లో కలకలం రేపిన ఆయన సౌదీలో మాత్రం ఇస్లామిక్ టెర్రరిజమ్ అనలేదు. ఊరికే ఉగ్రవాదం అనే అన్నాడు. కాని, మరే అమెరికన్ ప్రెసిడెంట్ చేయని ఒక్క సాహసం మాత్రం చేశాడు. సౌదీ గడ్డపై ఉగ్రవాదం మూలాల్ని తెగ నరకండని 50 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులకి తెగేసి చెప్పాడు! ఇది ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ వ్యాఖ్యే!

 

ఉగ్రవాదం మీద పోరంటూ పొద్దున్న లేస్తే హడావిడి చేసే అమెరికా సౌదీ అరేబియా లాంటి సంపన్న ఇస్లామిక్ దేశాల విషయంలో మాత్రం భిన్నమైన నీతి పాటిస్తుంటుంది. సౌదీ పాలకులు ప్రపంచంలోని చాలా సున్నీ ఉగ్రవాద ముఠాలకు ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా వైట్ హౌజ్ పెద్దగా పట్టించుకోదు. ఇప్పుడు అదే రూల్ ట్రంప్ కూడా ఫాలో అయిపోయాడు. 400బిలియన్ అమెరికన్ డాలర్స్ విలువ చేసే బిజినెస్ డీల్స్ సౌదీతో కుదుర్చుకున్నాడు. దీని వల్ల అమెరికాలో , సౌదీలో బోలెడు ఉద్యోగాలు వస్తాయని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాకపోతే, సౌదీ, అమెరికా డీల్ సారాంశం ఎప్పటి లాంటిదే! సౌదీ డబ్బు అమెరికాకి చేరుతుంది. అమెరికా ఆయుధాలు సౌదీకి చేరతాయి! ఇక ఉగ్రవాదం ఎలా అంతం అవుతుంది? ట్రంప్ కే తెలియాలి!

 

ఒకవైపు ఆయుధాలు పంచుతూ మరో వైపు ఉగ్రవాదం అరికట్టండి అని ఇస్లామిక్ దేశాలకు ట్రంప్ చెప్పటం ఒక విధంగా రాజకీయమే అవుతుంది. అంతకంటే ఎక్కువ నిజాయితీ ఆ మాటల్లో ఆశించటం దండగ. అయితే, ట్రంప్ మధ్య ప్రాచ్య పర్యటనలో ఒక్క విషయం మాత్రం ఇండియాకు అనుకూలమని చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు సౌదీ గడ్డపై ప్రసంగిస్తూ రష్యా, చైనా, యూరప్, అమెరికాల్లాగే ఇండియా కూడా ఉగ్రవాదానికి ఎంతో నష్టపోయిందని అన్నాడు. ఇది ఒక విధంగా మన దౌత్య నీతిలో భాగంగా దక్కిన చిన్న విజయంగా చూడవచ్చు. ప్రత్యేక లాభం ఏమీ లేకపోయినా… ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్ ముందంజలో వుందని అమెరికా కూడా ఒప్పుకున్నట్లైంది!

 

సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ట్రంప్ అత్యంత సంపన్న రాజ్యపు పాలకుల్ని సంతోష పెట్టడానికి ఇరాన్ ను సీరియస్ గా టార్గెట్ చేశాడు. తీవ్ర పదజాలంతో ఇరాన్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాడు. ఇది ఇరాన్ ను వ్యతిరేకించే సౌదీ అరేబియాకు సంతోషకరమైన అంశం. అలాగే, మధ్య ఆసియాలో ఇజ్రాయిల్ తో సరిహధ్దు పంచుకునే ఇరాన్ అంటే అమెరికాకు ముందు నుంచీ కోపమే. తన దారికి రాని ఆ ఇస్లామిక్ దేశమంటే అగ్ర రాజ్యానికి అసహనం. అదే మరోసారి ట్రంప్ మాటల్లో బయటపడింది. కానీ, అంతే ధీటుగా జవాబిచ్చాడు ఇరాన్ విదేశాంగ శాఖా మంత్రి.

 

ఉత్తర కొరియాతో యుద్ధమంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ట్రంప్ ఆసియాలో పర్యటించటం నిజంగా విశేషమే. అయితే, ఎన్నికలప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు మాత్రం ప్రపంచ ఉగ్రవాదానికి నిధులు వరదలా పారిస్తున్న దేశాలతోనే డీల్స్ ఓకే చేసుకోవటం మారిపోతున్న ఆయన రూటుకి నిదర్శనం. సౌదీ లాంటి దేశాల మైత్రి ట్రంప్ కు ఇప్పుడు చాలా అవసరం. కేవలం అమెరికాలో పెట్టుబడులు పెట్టించటానికి మాత్రమే కాదు… ఉత్తర కొరియా చెలరేగిపోతున్న తరుణంలో ఇస్లామిక్ దేశాలతో వైరం అమెరికా ఎంత మాత్రం తట్టుకోలేదు. అందుకే, ట్రంప్ ఇస్లామిక్ దేశాలకు సరికొత్త స్నేహ హస్తం అందించాడు. సరిగ్గా అదే సమయంలో నార్త్ కొరియా మిసైల్స్ పరీక్షిస్తూ కయ్యానికి కాలు దువ్వటం ట్రంప్ ను ఒత్తిడికి గురి చేస్తున్న అసలు అంశం ఏదో చెప్పకనే చెబుతుంది!

 

ఎన్నికలప్పుడు ఓటర్ల చప్పట్ల కోసం నినాదాలు ఇచ్చిన ట్రంప్ మెల్ల మెల్లగా తత్వం గ్రహిస్తున్నాడు. అప్పట్లో ఆయనలోని టీవీ హోస్ట్ చెలరేగిపోతే… ఇప్పుడు ఆయనలోని బిజినెస్ మ్యాన్ ఆచితూచి అడుగులు వేయిస్తున్నాడు!