ట్రంప్… తీసి పక్కన పడేయలేని ముళ్ల కిరీటం!

ఇప్పటి వరకూ అగ్రరాజ్యం ఎందరో అధ్యక్షుల్ని చూసింది. కాని, డొనాల్డ్ ట్రంప్ వారెవరి కోవలోకి రావటం లేదు. ఇటు జనం, అటు మీడియా, మొత్తం ప్రపంచం ఈ బిజినెస్ మ్యాన్ ని చూసి అవాక్కవుతూనే వుంది. అంతే కాదు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సంవత్సరం కూడా పూర్తి చేసుకోకుండానే ఓ అమెరికా అధ్యక్షుడు అభిశంసనకి గురవుతాడా అన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది! నాలుగేళ్ల పదవి కాలం ట్రంప్ వైట్ హౌజ్ లో పూర్తి చేసుకుంటాడా? లేక మధ్యలోనే వైట్ హౌజ్ నుంచి ఆయన హౌజ్ కి సాగనంపేస్తారా? ఇప్పుడు ఇదే ఎద్ద చర్చగా మారింది యూఎస్, యూరప్ లలో!

 

ట్రంప్ అధికారంలోకి వస్తాడనే ఎవరూ భావించలేదు. కాని,అనూహ్యంగా అద్యక్షుడైన ఆయన అంతే అనూహ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మీడియాను తిట్టడం, రష్యాను పొగడటం, చైనాను రెచ్చగొట్టడం, ముస్లిమ్ దేశాల వార్ని నిషేధించటం, అమెరికాలోని వలస ఉద్యోగుల బీపీ పెంచేయటం, మెక్సికో సరిహద్దులో గోడ కట్టడం… ఇలా అన్నీ బ్రేకింగ్ న్యూస్ లే! ఇవన్నీ ట్రంప్ తెలియక చేస్తున్నాడా? అర్థం కాక చేస్తున్నాడా? కావాలనే చేస్తున్నాడా? ఏది ఏమైనా అమెరికాతో పాటూ ప్రపంచమంతా ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతోంది. ఎంతగా అంటే, ట్రంప్ అభిశంసనకి గురై అధ్యక్ష పదవి కోల్పోతే బావుండుననేంతగా!

 

డొనాల్డ్ ట్రంప్ రష్యా సహకారం తీసుకున్నాడనే పుకార్లే తప్ప నిజంగా ఆయన తప్పు చేశాడనీ ఇప్పటి వరకూ నిరూపితం కాలేదు. కాబట్టి ఆయన విజయం నిఖార్సైందే అనుకుంటే నాలుగేళ్లు అమెరికాని ఏలే హక్కు ఆయనకు అమెరికన్ ఓటర్లే ఇచ్చినట్టు. కాని, తామే ఎన్నుకున్న మహానుభావుడ్ని ఇప్పుడు వారే భరించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పబ్లిక్ పాలసీ పోలింగ్ అనే ప్రైవేట్ సంస్థ తమ అధ్యక్షుడిపై సర్వే నిర్వహించింది. ఇందులో 54శాతం మంది ట్రంపు పాలన కంపుగా వుందని అభిప్రాయపడ్డారు. 40శాతం మంది ఓకే అంటే 6శాతం తమకు నో ఐడియా అని చెప్పారు. అంటే, మొత్తం మీద ట్రంప్ అప్పుడే జనం నుంచి విసుగు, చిరాకు ఎదుర్కొంటున్నాడన్నమాట! దీని కంటే ఆందోళనకరమైన విషయం మరోకటి వుంది. సర్వేలో పాల్గొన్న వారందరిలో 48శాతం మంది ప్రెసిడెంట్ ని తొలంగించాలని ఫీలయ్యారట! 41 శాతం మంది మాత్రమే ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకున్నారట! ఇది ట్రంప్ కి ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ లాంటిదే!

 

అమెరికా ఫస్ట్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ నిజానికి జనాల నాడి పట్టుకున్నాడనే చెప్పాలి. కాని, అదే సమయంలో వైట్ హౌజ్ లోకి వచ్చాక కామన్ అమెరికన్స్ కి ఆయన చేసిన మేలంటూ ఏం లేదు ఇప్పటి వరకూ. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ కలకలం సృష్టిస్తున్నాడు. తనకు నచ్చకపోతే అడ్వకేట్ జనరల్ మొదలు ఎఫ్బీఐ బాస్ వరకూ అందర్నీ బలవంతంగా తొలగించేస్తున్నాడు. వీటి వల్ల ఆయనకు శత్రువులు పెరుగుతున్నారే తప్ప అమెరికాలోని ట్రంప్ కు ఓటేసిన సామాన్య జనం లాభపడింది ఏం లేదు. ఇక మీదటన్నా తన దాదాగిరి పక్కన పెట్టి జనం ఏం కోరుకుంటున్నారో ఆలోచిస్తే బావుంటుంది. లేదంటే… ట్రంప్ అభిశంసనతో తప్పుకోకున్నా… నాలుగేళ్ల తరువాత చేతులెత్తేసి పక్కకు పోవాల్సిందే. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ గా దొరికిన అత్యంత అరుదైన అద్భుత అవకాశాన్ని ట్రంప్ చక్కగా వాడుకోవాలని కోరుకుందాం!