TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశీయ ఎయిర్‌లైన్స్ సంక్షోభం…కేంద్రం ఆదుకోకుంటే మూసివేతే!

Published on: Tue Apr 28, 2026 7:22PM

 

విమాన ఫ్యూయల్  ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్రం ఆదుకోకుంటే కంపెనీలు మూసివేయడమో, ఆపరేషన్లు నిలిపివేయడమో మినహా మరో మార్గం లేదని అంటున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ప్రధాన విమానాయాన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) ఈ మేరకు సివిల్ ఏవియేషన్ కార్యదర్శికి తాజాగా లేఖ రాసింది. 

ఎయిర్‌లైన్స్ ఆపరేషన్లు కొనసాగించాలంటే కేంద్రం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరింది.
అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)  ధరలతో దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఆపరేషన్లు అసాధ్యంగా, అస్థిరంగా మారుతున్నాయని ఎఫ్ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విమానయాన సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లకు గురువుతున్నాయని తెలిపింది. రెండు నెలలుగా ఇరాన్ యుద్ధం కొనసాగుతుండటంతో క్రూడాయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఏటీఎఫ్‌తో సహా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 

విమానాల విడిభాగాలు, లీజు చెల్లింపులు ఖరీదైనవిగా మారుతున్నాయి. టిక్కెట్ ధరలపై తీవ్రమైన పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గుతున్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధనం ధరల్లో పెరుగుదల ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసి, నిర్వహణ తలకుమించిన భారమవుతోందని చెబుతున్నాయి. 'ఎయిర్‌లైన్ ఆపరేషన్లు కొనసాగాలన్నా, సంస్థలు మనుగడ సాగించాలన్నా, ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలన్నా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. అర్ధవంతమైన ఆర్థిక సాయం ప్రకటించాలి' అని సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి రాసిన లేఖలో ఎఫ్ఐఏ కోరింది.