ఆంధ్ర ప్రాంతానికి డొక్కల కరువు పొంచి ఉందా?

 

* మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్
* 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి
* రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది
* వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష

మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.

 

 

కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:

 

సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.

 

 

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.