అమ్మ ఆమెకి అమ్మ కాదా..?

సినిమాలతో పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలితని అంతా 'అమ్మ' అని ఆప్యాయంగా పిలుస్తారు.అలాంటి అమ్మ కి తానే కూతుర్ని అంటూ బెంగళూరుకు చెందిన అమృత కోర్టును ఆశ్రయించింది.అమృత తన పిటిషన్‌లో జయలలిత పార్థివ దేహాన్ని వెలుపలికి తీసి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.ఈ కేసు విచారణ సమయంలో తమిళనాడు ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదని కోర్టుకు తెలిపారు.

 

 

పిటిషన్‌దారు జయలలిత ఆస్తుల కోసమే కూతుర్నని చెప్పుకుంటున్నారని వాదించారు.ఆమె జయలలిత కూతురైతే ఎందుకు ఒక్క ఫొటో కూడా తీసుకోలేదని అన్నారు. అమృత అందించిన రికార్డుల ప్రకారం తాను 1980 ఆగస్టులో జన్మించినట్లు చెప్పారని, అయితే ఆమె చెప్తున్న పుట్టిన తేదీకి నెల రోజుల ముందు జయలలిత ఓ ఫిలిం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారని కోర్టుకు విన్నవించారు. ఆ వీడియోను విజయ్‌ నారాయణ్‌ కోర్టుకు అందించారు.1980లో నాటి ఆ వీడియోలో జయలలిత గర్భంతో ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిపారు. అమృత కేవలం ఆస్తి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. అవసరమైతే జయలలిత బంధువులతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. న్యాయమూర్తి కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.