టిక్​ టాక్ యూజర్స్ పరిస్థితేంటి?.. ఇండియాలో యాప్ పనిచేస్తుందా?

చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్​ టాక్ యాప్ కూడా ఉంది. బ్యాన్ తో ఇప్పటికే టిక్ ​టాక్.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ‌ల నుంచి మాయమైంది. దీంతో టిక్ టాక్ ని వ్యతిరేకించే వారు సంతోషపడుతుండగా.. టిక్ టాక్ ని అభిమానించే వారు తెగ బాధపడిపోతున్నారు. అయితే కొందరు మాత్రం.. ప్లే స్టోర్ నుంచి తొలగించినంత మాత్రాన ఏం కాదు. ఇప్పటికే  ఇన్​స్టాల్ చేసుకున్న వారు హ్యాపీగా వాడుకోవచ్చని చెబుతున్నారు. మరికొందరైతే, వెబ్ సైట్ల నుంచి ఏపీకే లను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. దీంతో కొందరు టిక్ టాక్ యూజర్స్ సంతోషపడుతున్నారు. కొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే యాప్ ఇన్​స్టాల్​ చేసుంటే ఆ యాప్ నిజంగా​ పని చేస్తుందా?.. ఒకవేళ యాప్ ఉపయోగిస్తే చట్టపరంగా ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొనే ప్రమాదం ఉందా?.. అని టిక్ టాక్ యూజర్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే, ఒకవేళ యాప్ ఇన్​స్టాల్ అయి ఉన్నప్పటికీ అది పని చేయదని తెలుస్తోంది. నిషేధించిన ఆ చైనా యాప్స్ అన్నీ ఆన్‌లైన్‌ ఆధారంగా పని చేసేవే. అవి స్మార్ట్‌ ఫోన్లలో ఇన్​స్టాల్ అయి ఉన్నప్పటికీ పని చేయవు. ఆ యాప్‌లలో అప్‌డేట్లు ఇకపై కనపడవు. 

బ్యాన్​ విధింపుతో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఈ యాప్స్ కు​ ఇండియాలో డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్​ చేయకుండా బ్లాక్ చేస్తాయి. గతంలో ఓ యాప్ నిషేధానికి గురైతే డేటాతో సంబంధం లేకుండా పని చేసేది. కానీ, నెట్​వర్క్స్​ కూడా ఈ 59 యాప్స్​కి డేటా సరఫరా చేయొద్దని ఆదేశాలు అందడంతో భారత్ ​లో ఇవి పని చేయడం అసాధ్యం.

టిక్​ టాక్ ​తో సహా నిషేధానికి గురైన ఏ యాప్​ కూ ఇక అప్​డేట్స్ చూపించవు. అయినా ఫోన్లలో ఆ యాప్స్​ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. ఆ యాప్స్​ను స్మార్ట్‌ఫోన్లలో ఉంచుకోకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో భద్రత తగ్గిపోతుండడంతో వాటి ద్వారా స్మార్ట్‌ ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.