బీజేపీలో వైసీపీ వర్గం టీడీపీతో పొత్తును వద్దంటున్నారా?
Published on: Fri Mar 25, 2022 2:37PM
నిజమే. జాతీయ స్థాయిలో బీజేపీ అతి పెద్ద పార్టీ. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న,అత్యంత శక్తివంతమైన పార్టీ తమదే అని కూడా ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పుకుంటారు.కాలర్లు ఎగరేస్తుంటారు. అయితే, ఆంద్ర ప్రదేశ్’లో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అంతోటి గొప్ప పార్టీకి ఆంధ్ర ప్రదేశ్’లో ఒక ఎంపీ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు. ఎంపీ ఎమ్మెల్యే వరకు ఎందుకు, స్థానిక సంస్థలలోనూ ఒకటో అరో తప్పించి చెప్పుకోదగిన,గుర్తుంచుకోదగిన ప్రాతినిధ్యం లేదు. 2019 ఎన్నికలో ఆ పార్టీకి పోలైన ఓట్లు ‘నోటా’ కంటే తక్కువ. ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో, ఐదో స్థానంలోనో ఆరో స్థానంలోనో వుంది. ఆ తర్వాత జరిగిన తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ దక్కలేదు. అదే విధంగా ఈ మూడేళ్ళలో జరిగిన ఏ ఎన్నికలోనూ, బీజేపీ ఉన్నానని అనిపించుకున్న,ఉనికిని నిలుపుకున్న ఎన్నిక ఒక్కటి కూడా లేదు. నిజానికి ఏపీ రాజకీయాల్లో బీజేపీ నాన్ ప్లేయర్. ఆటలో అరటిపండు.
అయినా ఆపార్టీలో కొందరు నాయకులు తమ బలాన్నిఎక్కువగా లెక్కలేసుకుంటున్నారో ఏమో కానీ, తెలుగు దేశం పార్టీతో పొత్తు వద్దని తీర్మానాలు చేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పినప్పటి నుంచి, అధికార వైసీపీ అనుకూలంగా వర్గం బీజేపీ నేతలు, బీజేపీ మళ్ళీ టీడీపీకి దగ్గరవుతుందేమో అని, భయ పడిపోతున్నారు. నిజానికి, చంద్రాబాబు నాయుడు సహా టీడీపీ నాయకులు ఎవరూ ఇంతవరకు బీజేపీతో పొత్తు గురించి ఒక్కమాటైనా మాట్లాడలేదు. అయినా, వైసీపీ అనుకూల నేతలు టీడీపీతో పొత్తు వద్దంటూ పార్టీ హైకమాండ్‌కు లేఖలు రాస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీ అధికారంలోకి రాలేదని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం 23 అసెంబ్లీ, 3లోక్ సభ స్థానలు మాత్రమే దక్కిన 2019 ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన టీడీపీకి 40 పైగా ఓట్లు వచ్చాయనేది నిజం. టీడీపీ లేకుండా ఏపీలో విపక్షమే లేదు.
నిజానికి బీజేపీకి మొదటి నుంచీ కూడా టీడీపీ సహజ మిత్ర పక్షంగా ఉంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న ప్రతి సందర్భంలోనూ ఉభయ పార్టీలు ప్రయోజనం పొందాయి. ఒక చేత్తో చప్పట్లు కొట్టడం ఎలాగైతే, అయ్యే పని కాదో, అదే విధంగా ఎన్నికల పొత్తుల విషయంలోనూ అంతే, ఉభయ తారకంగా ఉంటేనే పొత్తు నిలుస్తుంది. వన్ సైడ్ లవ్ పెళ్లి పీటల వరకు రాదు. అయితే, బీజేపీలోని వైసీపీ వర్గం, అన్ని విధాల అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ గెలిచినా ఓకే కానీ, టీడీపీ గెలవకూడదన్నవిధంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆయన వర్గానికి చెందిన పుంజీడు మంది నాయకులు సమయం సందర్భం ఏదైనా, టీడీపీతో పొత్తుల గురించే మాట్లాడుతున్నారు. నిజానికి, ఇంతకు ముందే అనుకున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఎవరూ, బీజేపీతో మళ్ళీ పెళ్లి గురించి మాటవరసకు అయినా ఒక్క మాట మాట్లాడలేదు. అంతే కాదు, ఇంతవరకు టీడీపీ పొత్తుల ప్రస్తావనే తీసుకురాలేదు.
బీజేపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనంతట తానుగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించేందుకు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని అన్నారు.వైసీపీ వ్యతిరేక ఓటులో మేజర్ చుంక్ ( 40 శాతానికి పైగా) టీడీపీ ఓటే వుంది. టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న ప్రతిపాదన తెచ్చింది, బీజేపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయినా, ఒక శాతం ఓటైనా లేని బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాదుతోందని, వైసీపీ అనుకూల బీజేపీ వర్గం నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.


