స్టాలిన్‌ కి ప్రధాని ఆహ్వానం

 

ప్రధాని మోడీ తమిళనాడు భాజపా కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల నిమిత్తం గతంలో జట్టుకట్టిన అన్నాడీఎంకే, డీఎంకే లాంటి పాత మిత్రులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో భాజపా ఒంటరిగా మెజార్టీ సాధించినా కూడా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే తమ పార్టీ ఇష్టపడుతుందని మోడీ అన్నారు. నరేంద్రమోదీ వ్యాఖ్యలపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ స్పందించారు.

ప్రధాని ఆహ్వానాన్ని ఖరాకండిగా తోసిపుచ్చారు. భాజపాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘భాజపాతో డీఎంకే ఎన్నడూ పొత్తు పెట్టుకోబోదు. ప్రధాని తనను తాను వాజ్‌పేయీతో పోల్చుకోవడం విచిత్రంగా ఉంది. మోడీ ఏనాటికీ వాజ్‌పేయీ లాంటి నాయకుడు కాలేడు. మోడీ నేతృత్వంలో భాజపాతో పొత్తు అంత ఆరోగ్యకరం కాదు. రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుంది. వాజ్‌పేయీ ఎన్నడూ నిర్ణయాత్మక రాజకీయాలను సమర్థించలేదు. అందుకే ఆయనకు డీఎంకే మద్దతిచ్చింది’’ అని స్టాలిన్‌ చెప్పుకొచ్చారు.