TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో జేసీలకు DMHO బాధ్యతలు.. ప్రజారోగ్యానికి ప్రమాదమంటున్న నిపుణులు..

Published on: Wed Jun 23, 2021 12:26PM

టీచర్ చేయాల్సిన పని టీచర్ చేయాలి.. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి.. స్వీపర్ చేయాల్సిన పని స్వీపరే చేయాలి. ఇది అనాదిగా పెద్దలు చెబుతున్న మాట. అలా చేస్తేనే ఆ పని సాఫీగా సాగుతుంది. ఒకరూ చేయాల్సిన పని మరొకరు చేస్తే.. అది విఫలం కావడమే కాకుండా అనర్థాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎవరి ఏ పని చేయాలే నిర్ణయించి.. అందుకు అనుగుణంగానే ముందుకు పోతుంటారు. పాలనలోనూ ఇదే రూల్ అమలు చేస్తారు. అందుకే వివిధ విభాగాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంటారు. వైద్య శాఖకు సంబంధించి వైద్య రంగంలో ఉన్నవారినే నియమిస్తూ వస్తున్నారు. అలా అయితేనే ఆశాఖకు సరైన న్యాయం జరుగుతుందనే భావన. 

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంతా రివర్స్ పాలన సాగుతోంది. ఇప్పటికే జగన్ రెడ్డి సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఏపీ పరువు బజారున పడగా.. తాజాగా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి ఏపీ  సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. వైద్య రంగ ప్రముఖులను ఆశ్చర్యపరుస్తోంది. జిల్లా వైద్యాన్ని ఐఏఎస్ కు అప్పగించింది జగన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి జీవో 64 జారీ చేసింది. డీఎంహెచ్‌వో విధులన్నీ జేసీలకు (డెవల్‌పమెంట్‌) బదలాయించారు. పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్ట్‌, క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌, ఫుడ్‌ సేఫ్టీ యాక్ట్‌ కింద డీఎంహెచ్‌వోలకు ఎన్నో అధికారులు సంక్రమించాయి. వాటిని ఇకపై జేసీలు చెలాయించనున్నారు. చివరికి వైద్యుల ఏసీఆర్‌లపై పూర్తి అధికారాలను కూడా జేసీలకు అప్పగించారు. వీటితో పాటు డీసీహెచ్‌ఎస్‌, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఎన్‌హెచ్‌ఎం, ఆయుష్‌ శాఖలకు సంబంధించిన అధికారాలను కూడా జేసీలకే కట్టబెట్టారు

ఏపీలో వైద్య, ఆరోగ్యశాఖను ఆ శాఖ ఉన్నతాధికారులే నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు కొంత కాలంగా ఉన్నాయి.  ఇప్పటికే ఏపీవీవీపీ కమిషరేట్‌ను పూర్తిగా రద్దు చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ కమిషనరేట్‌ రద్దు తర్వాత.. దాని పరిధిలోని ఆస్పత్రులు, సిబ్బందిని ఏం చేయాలన్న దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. వైద్యులు ఉండాల్సిన ఏపీవీవీపీ కమిషనర్‌ స్థానంలో ఒక ఐఏఎస్ ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఓ వైద్యుడు అడ్డం తిరిగారన్న ఒకే ఒక్క కారణంగా.. ఏకంగా ఏపీవీవీపీని కనుమరుగు చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడేమో జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్‌వో) ఉన్న అధికారాలను మొత్తంగా జాయింట్‌ కలెక్టర్లకు బదలాయిస్తూ జీవో  64 తీసుకొచ్చారు.  

వైద్య విషయాల్లో డీఎంహెచ్‌వోలకు ఉన్న అవగాహన జేసీలకు ఉండదు. పాలనాపరంగా జేసీలు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, డీఎంహెచ్‌వో పోస్టు పూర్తిగా సాంకేతికపరమైంది. అవగాహన లేని జేసీలకు ఆ బాధ్యతలు అప్పగిస్తే ప్రజారోగ్యవ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ప్రస్తుతం ఆరోగ్యశాఖలో పదోన్నతుల కోసం వేల మంది ఎదురుచూస్తున్నారు. చివరి ఆరేళ్లు  పని చేసిన అధికారి నుంచి ఏసీఆర్‌లో సంతకం చేయించుకుని పదోన్నతుల సమయంలో డీపీసీకి సమర్పించాల్సి ఉంటుంది. డీఎంహెచ్‌వో అయితే ఈ వర్కంతా సులువుగా జరుగుతుంది. సర్కార్ తాజా నిర్ణయంతో  సంతకం కోసం వైద్య ఉద్యోగులు జేసీల ఆఫీసుల్లో గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. 

విశాఖ కేజీహెచ్‌లో 30 ఏళ్ల క్రితం ఇలాంటి వివాదమే జరిగింది. జిల్లా కలెక్టర్‌కు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు మధ్య ఏదో విషయమై సంఘర్షణ జరిగింది. ‘జిల్లా వైద్యం’పై ఎవరి అధికారం ఎంత అని అనుకొనేదాకా అది ముదిరింది. ఈ విషయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వరకు వెళ్లగా.. సూపరింటెండెంట్‌ అధికారాలే ఎక్కువని వారంతా ముక్తకంఠంతో తేల్చేశారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పోస్టును సివిల్ సర్వెంట్ అధికారికి అప్పగించాలని నిర్ణయించడంపై వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా వైద్యాన్ని ఐఏఎస్ కు అప్పగించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఐఎంఏ తీవ్రంగా తప్పుపడుతోంది. ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఐఎంఏ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా  వైద్య ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మూడు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.