డిఎల్ వ్యాఖ్యపై కాంగ్రెసు నాయకుల నుంచి వ్యతిరేకత
Published on: Sat Feb 11, 2012 9:20AM
న్
యూఢిల్లీ: ఢిల్లీకి సూట్‌కేసులు మోసుకెళ్లి పదవులు తెచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేసిన ప్రకటనకు కాంగ్రెసు పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. డిఎల్ వ్యాఖ్యలను ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వ్యతిరేకించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి అటువంటి ప్రకటన చేయడం శోచనీయమని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ఏ సందర్భంలో ఆ మాటన్నారో తెలియదని, దానికి వివరణ ఇవ్వదలుచుకోలేదని, అయితే డబ్బులు ఇస్తే పదవులు వస్తాయనే మాట సరి కాదని ఆమె అన్నారు. సూట్‌కేసులకు తమ పార్టీ అధిష్టానం పదవులు ఇవ్వదని ఆమె స్పష్టం చేశారు. తాను రాజ్యసభ రేసులో ఉన్నట్లు సాగుతున్న చర్చల్లో నిజం లేదని ఆమె చెప్పారు. తెలంగాణపై చర్చలు సాగుతున్నాయని ఆమె చెప్పారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా ఖండించారు. డిఎల్ చేసిన వ్యాఖ్య దురదృష్టకరమైందని ఆయన అన్నారు.


