మళ్ళీ 'దేశం'లోకి డికె ఆదికేశవులు?
Published on: Thu Mar 8, 2012 11:18AM
చిత్
తూరుజిల్లా: చిత్తూరుజిల్లాకు చెందిన పార్లమెంట్ మాజీ సభ్యుడు డికె ఆదికేశవులునాయుడు మళ్ళీ తనరూటు మార్చబోతున్నాడు. కాంగ్రెస్ హయాంలో టిటిడి ఛైర్మన్ గా వ్యవహరిస్తూ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రాపకంతో చిత్తూరుజిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆదికేశవులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీవైపు ఆశగా చూస్తున్నట్లు తెలిసింది. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరపునే పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. అయితే యుపిఎ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా పార్టీ విప్ ను ధిక్కరించి ఆదికేశవులునాయుడు ఓటు వేశారు. దీనిపై చంద్రబాబు ఆదికేశవులునాయుడుపై చాలా సీరియస్ అయ్యారు.
అనంతరం ఆదికేశవులునాయుడు వైయస్ పంచనచేరి టిటిడి ఛైర్మన్ పదవిని పొందారు. ఒకవైపు ఆదికేశవులునాయుడు కాంగ్రెస్ లో ఉండగానే మరోవైపు ఆయన కుమారుడు ప్రజారాజ్యంపార్టీ తరపున గత లోక్ సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేశారు. ఈ పరిణామం అప్పట్లో వైయస్ కు కూడా చికాకు కలిగించింది. రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్యగాని, కిరణ్ కుమార్ రెడ్డిగాని ఆదికేశవులునాయుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీంతో తీవ్రమనస్తాపానికి గురయిన ఆయన తిరిగి తెలుగుదేశంపార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన కుప్పంలో ఒక కార్యక్రమానికి హాజరయిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తరువాత డికె ఆదికేశవులునాయుడు విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని, అరాచకాలను ప్రోత్సహిస్తున్నదని విమర్శలు గుప్పించారు. దీంతో దేశంలో చేరడానికి ఆయనకు లైన్ క్లియర్ అయినట్లుగా భావించాల్సి వస్తోంది.


