TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలో జిల్లాల సెగ.. ఆనం, రోజాల గోడువిన‌వా జ‌గ‌న‌న్న‌!

Published on: Fri Feb 18, 2022 1:23PM

ఆంధ్రప్రదేశ్’లో జిల్లాల పునర్విభజన వ్యవహారం, అధికార పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందా అంటే, అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. అంతే కాకుండా మంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ నాయకులు ఇతరత్రా వివిధ కారణాల చేత అసంతృప్తితో ఉన్న నాయకులకు తమ అసంతృప్తిని వ్యకపరిచేందుకు, జిల్లాల విభజన ఒక  అవకాశం కల్పించిందని అంటున్నారు. 

ఇప్పటికే, నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి, నగరి నియోజకవర్గాన్ని బాలాజీ (తిరుపతి) జిల్లాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా నియోజక వర్గంలో పర్యటించిన ఆమె  జిల్లాల పునర్విభజనకు సంబదించి ప్రజాభిపాయాన్ని సేకరించారు. ఇందుకు సంబందించిన నివేదికను, ఆమె ముఖ్యమంత్రికి జగన్ రెడ్డికి, చీఫ్ సెక్రెటరీ సమీర శర్మకు సమర్పించారు. నగరి నియోజక వర్గంలో అధిక భాగం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉందని అందుకే నగరి నియోజక వర్గాన్ని, బాలజీ   జిల్లాలో చేర్చాలని కోరారు. నియోజక వర్గ ప్రజలు కూడా అదే కోరుతున్నారని ఆమె వివరిచారు. 

రోజా మంత్రి పదవిని ఎంతగా ఆశిస్తున్నారో వేరే చెప్పనక్కర లేదు. గుళ్ళు గోపురాలు పట్టుకు తిరగడం మొదలు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలాగే ఆమెకు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి మధ్య పచ్చ గాడి వేస్తే భగ్గుమనే పరిస్థతి వుంది. ఆమెకు మంత్రి పదవి రాకపోవడానికి అది కూడా కానమని అంటారు. అయితే, రోజా ఈ రెండు విషయాల్లో తమ  అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఈ మార్గాని ఎంచుకున్నారా, లేక జగనన్నకు తమ ఆవేదనను తెలియ చేసేందుకే ఈ మార్గన్ని ఎంచుకున్నారా అనేది స్పష్టం కావలసి వుంది. 

అదలా ఉంటే, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి అయితే జిల్లాల విభజన అంశాన్ని తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు అస్త్రంగా చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. కాగా, ఇప్పటికే ఒకటి రెండు సందర్భాలలో ముఖ్యమంత్రి వ్యవహార తీరుపై భగ్గుమన్న ఆనం, ఇప్పుడు మళ్ళీ మరోమారు జిల్లాల పునర్విభజన పై అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. జిల్లా విభజన  సహేతుకంగా జరగలేదని, రైతులు ఇబ్బంది పడతారని, సాగునీటి ప్రాజెక్ట్ ల వద్ద కొట్లాటలు జరుగుతాయని, ఒక విధంగా రాష్ట్రంలో  అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొంటాయని   అన్నారు. అదికరాలపై అయితే ఆనం, తగ్గేదే లే’ తీరులో విరుచుకు పడ్డారు. ఇలా మాజీ మంత్రి మాట్లాడిన తీరు, జగన్ రెడ్డితో ఇక తాడో పేడో తేల్చుకునే రీతిలోనే ఉందని, ఒక రకంగా ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమేనని పరిశీలకులు అంటున్నారు. 

అయితే ఇప్పటికే సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో తప్పటడుగులు వేసి, తిప్పలు కొని తెచ్చుకున్న నేపధ్యంలో, రామనారాయణ రెడ్డి విషయంలో తొందరపాటు ప్రకటనలు చేయవద్దని, పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఆనం ఇక వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే ఆయన జంకూ బొంకూ లేకుండా జగన్ నిర్ణయాలను  ప్రశ్నిస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.నిజానికి ఆనం తనంతట తానూ బయటకు రావడం కాకుండా, తనపై పార్టీ వేటు వేయాలని కోరుకుంటున్నారనే  మాట కూడా ఆనం సన్నిహితుల నుంచి వినిపిస్తోంది.