డిసిసి అధ్యక్ష పదవులకు పోటాపోటీ
Published on: Sat Apr 7, 2012 8:14AM
జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవులకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. త్వరలో అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించబోతున్నట్లు ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్ ఛార్జి కృష్ణమూర్తి ప్రకటించారు. అయితే డిసిసి అధ్యక్షుడుగా ఎంపిలను, ఎమ్మెల్యేలను నియమించబోమని ప్రజాప్రతినిధులు కానివారికే ఈ అవకాశం ఇస్తామని మెలిక పెట్టారు. ఈ మెలిక ప్రజాప్రతినిధులకు ఆందోళన కలిగించగా ఆశావహులకు ఆనందం కలిగించింది. ప్రజాప్రతినిధులుగా లేని నాయకులు డిసిసి పదవిని పొందితే తరువాత వచ్చే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోవడం సునాయాసంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.
అందుకే డిసిసి అధ్యక్ష పదవికోసం పైరవీలు ప్రారంభించారు. అయితే ప్రజాప్రతినిధుల వాదన మరోలా ఉంది. కొత్తగా ఎవరినైనా డిసిసి అధ్యక్షులుగా నియమిస్తే వారు తమకు ఏకు మేకై ఇబ్బందులు పెట్టవచ్చని భయపడుతున్నారు. ఇటీవల పిసిసి, డిసిసి అధ్యక్షుల మాటలకు కాంగ్రెస్ పార్టీలో విలువ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైనా గట్టి వ్యక్తి డిసిసి అధ్యక్షుడైతే తమ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారవచ్చునన్న భయాన్ని కూడా కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సమస్యను మొగ్గస్థాయిలోనే తుంచి వేయాలని వారు యోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గం నుంచి మాత్రమే డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ వారు డిమాండ్ పెడుతున్నారు. మరో రెండేళ్ళ తరువాత జరుగనున్న సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ కోసం డిసిసి అధ్యక్షుడి రూపంలో ముంచుకొచ్చే పోటీని నివారించుకునేందుకు ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ ప్రయత్నంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


