మాటే మంత్రం

అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఓసారి పెద్ద ఆపద వచ్చింది. శత్రుదేశం వారు తమ రాజుని బంధించి తీసుకుపోయారు. ఆ శత్రుదేశపు కోటలోకి అడుగుపెట్టి, రాజుగారిని విడిపించుకుంటే కానీ... తమ రాజ్యానికి భవిష్యత్తు ఉండదు. కానీ ఎలా ఆ శత్రుదేశం సాధారణమైనది కాదు. ఆ దేశానికి ఉన్న కోటగోడలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కోటగోడలను దూకి ఎలాగైనా లోపలకి ప్రవేశించేందుకు ఓ వందమంది యోధులు బయల్దేరారు. అంత పెద్ద కోట గోడని ఎవ్వరూ ఎక్కి రాలేరులే అన్న ధీమాతో శత్రుసైనికులు కోట లోపలే ఏదో పండుగ సంబరాలలో మునిగిపోయి ఉన్నారు. కోటగోడను చేరుకున్న తర్వాత తల పైకెత్తి చూసిన యోధులకు కళ్లు తిరిగిపోయాయి. ‘అబ్బే ఈ గోడని ఎక్కడం మన వల్ల కాదెహే!’ అంటూ ఓ యోధుడు ముందుగానే కూలబడిపోయాడు. మరికొందరు ఓ నాలుగడుగులు పైకెక్కి.... ‘అబ్బే ఈ గోడ నున్నగా జారిపోతోంది. దీన్ని ఎక్కడం అసాధ్యం,’ అంటూ చెట్ల కిందకి చేరుకున్నారు. అలా ఒకొక్కరే కోటగోడను ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకోసాగారు. పైగా ఎక్కుతున్నవారితో కూడా ‘ఆ కోటని ఎక్కడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఇంత ఎత్తైన కోట గోడల వల్లే, ఈ రాజ్యం ఇంత గొప్పదయ్యింది,’ అని అరుస్తూ నిరుత్సాహపరచసాగారు.

 

ఒకవేళ ఆ మాటలు వినిపించుకోకుండా ఎవరన్నా మరికాస్త పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే- ‘చెబుతోంది నీకే! బతికుంటే మరో రాజుని ఎన్నుకోవచ్చు. అనవసరంగా ఈ గోడని ఎక్కి నీ ప్రాణాలు కోల్పోవద్దు,’ అంటూ అరిచి గీపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకి వినిపించే మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా క్రమంగా పైకి ఎక్కసాగాడు. అలా ఎక్కే ప్రయత్నంలో, నాలుగడుగులు పైకి ఎక్కితే పది అడుగులు కిందకి జారిపోతున్నాడు. కాళ్లూ చేతులూ దోక్కుపోయి రక్తం ఓడుతున్నాడు. అయినా పట్టువిడవకుండా గోడ ఎక్కుతూనే ఉన్నాడు. అతను మూర్ఖుడనీ, చావుకి సిద్ధపడుతున్నాడనీ కింద ఉన్నవాళ్లు అరుస్తూనే ఉన్నారు. ఎట్టకేళకు ఓ అయిదు గంటలు గడిచిన తర్వాత... ఆ వ్యక్తి కోట గోడను చేరుకున్నాడు. శత్రువుల కంట పడకుండా కోట తలుపులు తీసి తన తోటివారిని లోపలకి తీసుకువెళ్లాడు.

 

వందమంది యోధులూ కలిసి శత్రుసైనికులను తుదముట్టించారు. తమ రాజుగారిని విడిపించుకుని విజయంతో తమ రాజ్యానికి చేరుకున్నారు. ‘ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా కూడా ఇతగాడు వెనక్కి తగ్గలేదు ప్రభూ! కోట గోడని ఎక్కేదాకి తన ప్రయత్నాన్ని విరమించలేదు,’ అంటూ ఆ ఒక్క వీరుడినీ రాజుగారికి పరిచయం చేశాడు సేనాధిపతి. తన ముందు నిలబడిన ఆ వీరుని చూసిన రాజుగారు తెగ ఆశ్చర్యపోయారు. కారణం... అతను చెవిటివాడు. ‘ఒకోసారి మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెవిన పడకపోవడమే మంచిది మహారాజా! కోటగోడను ఎవ్వరూ ఎక్కలేరంటూ తోటివారంతా అరిచిన అరుపులు ఇతనికి వినపడకపోవడం వల్లే, తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. ఒకోసారి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చెవిటివాడిలాగా ఇతరుల మాటలను వినిపించుకోకపోవడమే మంచిదేమో!’ అన్నాడు సేనాధిపతి.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.