TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిటైర్డ్ ఉద్యోగుల సొమ్ముల‌కు శ‌ఠ‌గోపం!.. ఏడాదైనా డ‌బ్బులివ్వ‌ని జ‌గ‌న‌న్న..

Published on: Wed Feb 9, 2022 11:27AM

ఆంధ్రప్రదేశ్ లో రిటైరైన ఉద్యోగులకు 2 వేల 100 కోట్ల రూపాయలు బాకీ పడింది సర్కార్. వారికి పీఎఫ్, బీమా, గ్రాట్యుటీ సొమ్ము ఏడాది కాలంగా అందలేదు. ఏపీలో పాతిక వేల మంది రిటైరైన ఉద్యోగులకు తీరని కష్టంగా మారింది. రిటైరైన ఉద్యోగులకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ సర్కార్ పెట్టిన క్రిస్మస్, సంక్రాంతి గడువులు కూడా దాటిపోయాయి. గతంలో రిటైరైన రోజునే ఉద్యోగుల చేతికి సొమ్ములు అందేవి. వారిని సన్మానించి, గౌరవంగా వీడ్కోలు పలికేవారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి.

పాతికేళ్లో, ముప్పై ఏళ్లో ఉద్యోగం చేశారు! సర్వీసులో ఉండగా ఏపీజీఎల్ఐ, పీఎఫ్ పేరిట నెలనెలా సొమ్ములు దాచుకుంటూ వచ్చారు. దీనికి తోడు సర్కార్ గ్రాట్యుటీ మొత్తం ఇస్తుందని.. రిటైర్మెంట్ రోజున ఇవన్నీ తమకు కొండంత అండగా ఉంటాయనే ధీమాతో ఉద్యోగులు ఉంటారు. కానీ... వీరందరి ఆశలపై ప్రస్తుత వైసీపీ సర్కార్ నీళ్లు చల్లేస్తోంది. గతంలో రిటైర్మెంట్ రోజునే అందే ప్రయోజనాలు.. ఇప్పుడు ఏడాది దాటిపోతున్నా అతీ గతీ లేదు. గ్రాట్యుటీ, పీఎఫ్ తో పాటు గడువు తీరిన బీమా బాండ్ల పరిస్థితి అంతే సంగతులు! ఈ మొత్తం దాదాపు 2 వేల 100 కోట్లు ఉంటుందట. ఇదంతా ఉద్యోగులు  దాచుకున్న సొమ్మే. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెలనెలా దాచుకున్న సొమ్మే. అంటే.. అచ్చంగా అది ఉద్యోగుల డబ్బే. అదేవిధంగా ఉద్యోగులు తమకు వచ్చే జీతాన్ని బట్టి ఇంత మొత్తం బీమా బాండ్లు కొనాలని ప్రభుత్వం చెబుతుంది. అలా జీఎస్ఎఐ బాండ్లను ఉద్యోగులు తమ జీతం సొమ్ముతోనే కొనుగోలు చేస్తారు. ఆ సొమ్ములు ప్రభుత్వం వద్ద ఉంటాయి. వాటి కాలపరిమితి తీరిపోగానే తిరిగి ఉద్యోగులకు చెల్లించాలి. తమ ఆర్థిక అవసరాలకు దాచుకున్న వాటినే ప్రభుత్వం ఇవ్వకపోవడంతో. డబ్బుల్లేక రిటైరైన ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

గత ఏడాది దాదాపు 25వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. వీరికి ఒక్కొక్కరికీ 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకూ పీఎఫ్, గ్రాట్యుటీ, బీమా సొమ్ములు రావాల్సి ఉంది. ఏడాది కాలంగా వీటి కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. గత ఏడాది ఆగస్టులో 2 వందల 35 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు జీఓ జారీచేసింది రాష్ట్ర సర్కార్. కానీ.. నిధులు మాత్రం విడుదల చేయలేదు. సీఎస్ఎంఎస్ లో వాటిని పెండింగ్ పెట్టేశారు.

గతంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైరైన రోజునే పదవీ విరమణ ప్రయోజనాలన్నీ అందించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం పరిస్థితి తలకిందులైంది. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాలని పీఆర్సీ ఆందోళనల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగానే అడిగారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీనీ పొందలేకపోయారు. దీంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రిటైరైన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.