తెలంగాణ పై వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్

 

digvijay singh telangana, telangana digvijay singh, chiranjeevi telangana

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయింది. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. సీడబ్లూసీ నిర్ణయం జరిగిపోయాక వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. దీనికి అందరూ ఒప్పుకోవాలి. ముందు ఒప్పుకొని ఇప్పుడు అడ్డం తిరిగితే ఒప్పుకునేది లేదు. మీకు ఏవయినా సమస్యలు ఉంటే ఆంటోని కమిటీకి చెప్పుకోండి. ఈ నెల 19, 20 తేదీలలో రాష్ట్రానికి వస్తుంది. పార్లమెంటు సమావేశాల కారణంగా ఇప్పటికిప్పుడు రావడం కుదరదు అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ గురువారం రాత్రి మరోసారి వార్‌రూమ్‌లో సమావేశమైంది.

 

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అంటోనితో పాటు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్పమొయిలీలు ఉన్నారు. సీమాంధ్రులు కోరుకునే డిమాండ్ల మీదనే కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. కేంద్ర మంత్రులు పళ్లం రాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు కమిటీకి తమ వాదనను వినిపించారు. రాయల తెలంగాణ ఇవ్వాలని కోట్ల కోరగా, సమైక్య రాష్ట్రాన్ని ఎక్కువ మంది ప్రజలు కోరుతున్నారని, రాష్ట్రానికి వచ్చి పరిస్థితి గమనించాలని పళ్లం రాజు విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని చిరంజీవి కోరారు.