కిరణ్ అధిష్టానం మాట జవదాటడు: దిగ్విజయ్ సింగ్

 

“ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విదేయుడు. ఆయన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఆయన రాష్ట్ర విభజనకు ఇదివరకే అంగీకరించారు,” అంటూ కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ అన్నమాటలను కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఖండించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేమో కానీ తన సమైక్యవాదంలో ఎటువంటి మార్పు లేదని, ఉండబోదని నిర్ద్వందంగా ప్రకటించారు. నేటికీ ఆయన అదే పంధాను కొనసాగిస్తున్నారు కూడా.

 

అయితే ఈ రోజు అంటోనీ నివాసంలో జరిగిన కేంద్రమంత్రుల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ మళ్ళీ కిరణ్ గురించి అదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఈ సమావేశంలో మిగిలిన ఇతర అంశాలతో బాటు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే దిగ్విజయ్ ఈ విధంగా మాట్లాడటం చూస్తే ముఖ్యమంత్రి నిబద్దతపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకే ఈవిధంగా చేస్తున్నారా? లేక నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పిన ప్రకారమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏమయినప్పటికీ మరికొద్ది రోజులలో అందరి అసలు రూపాలు బట్టబయలవడం ఖాయం.